సిఏఏ విషయంలో కేంద్రం ఎందుకు అంత పట్టుదలగా ఉంది?
సీఏఏ (సిటిజన్ షిప్ అమండ్ మెంట్ ఆక్ట్ )ను కచ్చితంగా అమలు చేసి తీరుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
By: Tupaki Desk | 14 March 2024 6:53 AM GMTసీఏఏ (సిటిజన్ షిప్ అమండ్ మెంట్ ఆక్ట్ )ను కచ్చితంగా అమలు చేసి తీరుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సీఏఏ అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎవరి కోసం ఉద్దేశంచిన చట్టం కాదని శరణు కోరి వచ్చిన వారికి పౌరసత్వం అందివ్వడం మన కర్తవ్యం. అది రాజ్యాంగంలోనే ఉంది. రాజ్యాంగ విలువలను కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఈ చట్టం తీసుకొచ్చాం. దీని అమలులో ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేసేది లేదన్నారు.
ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఈ చట్టం ఎందుకు తెచ్చామో వివరణ ఇచ్చాం. ఎందుకు వద్దంటున్నారో రాహుల్ గాంధీ కూడా వివరణ ఇవ్వాలి. సీఏఏ అమలు విషయంలో తగ్గేది లేదన్నారు. జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా తన మనసులోని మాటలను వెల్లడించారు.
సీఏఏపై చాలా సమావేశాల్లో మాట్లాడాను. చట్టం ఇప్పటిది కాదు. కోవిడ్ కంటే ముందే తీసుకొచ్చాం. కానీ దాని అమలు ఆలస్యమైంది. ఎన్నికల కోసమే దీన్ని తీసుకొచ్చామని చెప్పడం సమంజసం కాదు. ప్రతిపక్షాలు ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తూ పనికొచ్చే చట్టాలను సైతం తప్పుబట్టడం కొత్తేమీ కాదు. కానీ తాము మాత్రం సీఏఏ అమలులో తాత్సారం చేయబోమని తేల్చారు.
370 ఆర్టికల్ రద్దు గురించి కూడా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయి. కానీ ఇప్పుడు దాని అమలుతో జమ్ము కాశ్మీర్ సుభిక్షంగా మారడం చూసి ఆశ్చర్యపోతున్నారు. సీఏఏ విషయంలో కూడా అదే జరుగుతుందని అమిత్ షా నమ్ముతున్నారు. దీని కోసమే తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. పలు రాష్ట్రాలు దీని గురించి కామెంట్ చేయడం తప్పుబట్టారు. వారికి అవగాహన లేకే అలా మాట్లాడుతున్నారన్నారు.
సీఏఏ చట్టం అమలుపై ఆందోళనలు పెరిగితే పునరాలోచిస్తారా? అనే ప్రశ్నకు చట్టాన్ని వెనక్కి తీసుకోబోమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని ఉపసంహరిస్తామని చెప్పడం వారి అనైతికతకు నిదర్శనం. మోదీ సర్కారు తీసుకొచ్చిన చట్టం రద్దు చేయడం అసాధ్యమన్నారు. పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లోని ముస్లిమేతరుల కోసం ఉద్దేశించింది ఈ చట్టం. ఇందులో ఎలాంటి లోపాలు లేవు. సక్రమంగా అమలు చేయడం మా బాధ్యత.