Begin typing your search above and press return to search.

రాహుల్ కు ఆఫర్ చేసిన బంగ్లా చరిత్ర ఏంటి?

కాంగ్రెస్ ఎంపీ కం లోక్ సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీకి ప్రభుత్వం కొత్త బంగ్లాను కేటాయించింది.

By:  Tupaki Desk   |   27 July 2024 9:30 AM GMT
రాహుల్ కు ఆఫర్ చేసిన బంగ్లా చరిత్ర ఏంటి?
X

కాంగ్రెస్ ఎంపీ కం లోక్ సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీకి ప్రభుత్వం కొత్త బంగ్లాను కేటాయించింది. గతంలో ఆయనకు కేటాయించిన బంగ్లా విషయంలో చోటు చేసుకున్న వివాదం తెలిసిందే. కోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ పై స్పీకర్ వేటు వేసినంతనే.. హడావుడిగా ఆయన నివాసాన్ని ఖాళీ చేయించే విషయంలో ప్రదర్శించిన అత్యుత్సాహం అప్పట్లో విమర్శలకు తావిచ్చింది. రాహుల్ మీద సానుభూతికి కారణమైంది. తాజాగా రాహుల్ కు కొత్త ఇంటిని కేటాయించింది.

సునేహ్రి బాగ్ రోడ్ లోని బంగ్లా నెంబర్ 5ను హౌస్ కమిటీ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు ఈ బంగ్లాలో బీజేపీ చిత్రదుర్గ ఎంపీ ఎ.నారాయణస్వామి ఉండేవారు. ఆయన మోడీ2.0లో సహాయ మంత్రిగా పని చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవటంతో పోటీకి దూరంగా ఉన్నారు. రాహుల్ కు కేబినెట్ హోదా ప్రకారం టైప్ 8 బంగ్లా ఆఫర్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ బంగ్లా కేటాయింపుపై రాహుల్ తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. రాహుల్ కానీ ఈ బంగ్లాకు ఓకే చెబితే ఫార్మల్ నోటిఫికేషన్ జారీ కానుంది.

ఇప్పటివరకు తొమ్మిది మంది మంత్రులకు ప్రభుత్వ బంగ్లాలు కేటాయించారు. తొలివరుసలోనే రాహుల్ కు ఇంటిని కేటాయించటం గమనార్హం. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలుశిక్ష పడి.. లోక్ సభలో అనర్హత వేటు పడిన సందర్భంలో అత్యుత్సాహంతో రాహుల్ ను 12, తుగ్లక్ రోడ్ లోని ప్రభుత్వ నివాసం నుంచి ఆయన్ను ఖాళీ చేయించటం.. అప్పటి నుంచి ఆయన తన తల్లి సోనియాగాంధీ ఉంటున్న 12 జన్ పథ్ లో ఉంటున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వయనాడ్.. రాయబరేలీ నియోజకవర్గాల నుంచి ఎంపీగా గెలుపొందిన రాహుల్.. వయనాడ్ ను వదులుకోవటం తెలిసిందే. లోక్ సభ ప్రతిపక్షనేతగా ఎంపిక కాకవటంతో రాహుల్ కు కేబినెట్ ర్యాంక్ హోదాలభించింది. దీంతో ఆయనకు సునేహ్రి బాగ్ రోడ్ లోని బంగ్లా నెంబరు 5ను కేటాయించారు. మరి.. దీనిపై రాహుల్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ అధికారులు ఆఫర్ చేసిన బంగ్లాను చూసేందుకు శుక్రవారం ప్రియాంక వాద్రా వచ్చారు. త్వరలోనే నిర్ణయం వెలువడే వీలుందంటున్నారు.