Begin typing your search above and press return to search.

రాజధాని అమరావతికి మరో శుభవార్త!

ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంది.

By:  Tupaki Desk   |   16 Aug 2024 9:29 AM GMT
రాజధాని అమరావతికి మరో శుభవార్త!
X

ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంది. ఇందులో భాగంగా 56 కిలోమీటర్ల అమరావతి రైల్వే నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తాజాగా రైల్వే బోర్డు కూడా అమరావతి రైల్వే లైన్‌ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)కు ఆమోద ముద్ర వేసింది. అలాగే ఈ ప్రాజెక్టుకు నీతిఆయోగ్‌ కూడా ఆమోదం తెలిపింది. ఈ రైల్వే ప్రాజెక్టులో రాజధాని అమరావతిని గుంటూరు, విజయవాడ నగరాలతో అనుసంధానిస్తారు. మొత్తం 56 కిలోమీటర్ల రైల్వే లైనుకు రూ.2047 కోట్ల ఖర్చు కానుంది.

ఈ రైల్వే ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై ఒక భారీ వంతెనను నిర్మిస్తారు. ఎర్రుపాలెం – అమరావతి–నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల మేర రైలు మార్గం నిర్మిస్తారు. కృష్ణానదిపై ఎన్టీఆర్‌ – గుంటూరు జిల్లాల మధ్య కొత్తపేట– వడ్డమాను గ్రామాల మధ్య 3 కిలోమీటర్ల వంతెన నిర్మిస్తారు.

ఈ రైల్వే లైను కోసం ముందుగా భూసేకరణ చేపడతారు. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా, ఖమ్మం జిల్లాల పరిధిలో భూసేకరణ, రైల్వే లైను నిర్మాణానికి రూ.2600 కోట్ల ఖర్చు అవుతుందని చెబుతున్నారు.

కాగా ఈ రైల్వే లైను ఎర్రుపాలెం వద్ద ప్రారంభమై గుంటూరు జిల్లాలోని నంబూరు వద్ద ముగుస్తుంది. హైదరాబాద్‌ – విజయవాడ మార్గంలో ఎర్రుపాలెం వద్ద, చెన్నై–విజయవాడ మార్గంలో నంబూరు వద్ద కలుస్తుంది.

ఎర్రుపాలెం తర్వాత పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరులలో రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు.

అమరావతి నుంచి దేశంలో అన్ని ప్రాంతాలకు రైళ్లు నడిపే ప్రణాళిక ఉంది. ప్రస్తుతం ఢిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ వైపు వెళ్లే రైళ్లన్నీ కాజీపేట మీదుగా విజయవాడ వచ్చి, అక్కడి నుంచి తెనాలి మీదుగా చెన్నై వైపు ప్రయాణిస్తున్నారు.

ఇక నుంచి ఎర్రుపాలెం–నంబూరు లైన్‌ అందుబాటులోకి వస్తే.. ఆయా రైళ్లు విజయవాడకు రావాల్సిన అవసరం ఉండదు. ఎర్రుపాలెం వద్ద కొత్తలైన్‌ లోకి ప్రవేశించి అమరావతి మీదుగా నంబూరు వస్తాయి. అక్కడి నుంచి న్యూగుంటూరు మీదుగా తెనాలి వెళ్లి.. చెన్నై వైపు వెళ్లే ప్రధాన రైలుమార్గంలో కలవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు.