కేంద్ర మంత్రి ఇంట్లో శవం.. చంపింది ఎవరంటే!
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలో బెగారియో గ్రామంలో కేంద్ర మంత్రి కౌషల్ కిశోర్ కు నివాసం ఉంది
By: Tupaki Desk | 1 Sep 2023 7:58 AM GMTకేంద్ర మంత్రి గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి కౌషల్ కిశోర్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇంట్లో ఓ యువకుడి మృతదేహం కనిపించడం తీవ్ర కలకలానికి కారణమైంది. కాగా మృతి చెందిన యువకుడు కేంద్ర మంత్రి కుమారుడు వికాస్ కు స్నేహితుడు వినయ్ శ్రీవాస్తవగా గుర్తించినట్టు తెలుస్తోంది.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలో బెగారియో గ్రామంలో కేంద్ర మంత్రి కౌషల్ కిశోర్ కు నివాసం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి కుమారుడు వికాస్ స్నేహితుడు ఒకరు పార్టీ చేసుకుందామని తమ స్నేహితుడైన వినయ్ శ్రీవాస్తవ అనే వ్యక్తిని పిలిచినట్టు సమాచారం.
ఈ క్రమంలో సెప్టెంబర్ 1న శుక్రవారం తెల్లవారుజామున 4.15 వరకు పార్టీ జరిగిందని తెలుస్తోంది. అదే సమయంలో వినయ్ శ్రీవాస్తవను కాల్చిచంపారు. అతడి తలలో షూట్ చేయడంతో అక్కడికక్కడే అతడు మృతి చెందాడు. కాగా మృతుడు వినయ్ శ్రీవాస్తవ కూడా బీజేపీ కార్యకర్త అని చెబుతున్నారు.
వినయ్ ను హత్య చేయడానికి ఉపయోగించిన రివాల్వర్ మంత్రి కుమారుడు వికాస్ దేనని అంటున్నారు. వికాస్ కు లైసెన్సుడ్ రివాల్వర్ ఉంది. దాని ద్వారానే వినయ్ ను తలతో కాల్చి చంపారని చెబుతున్నారు. మరోవైపు హత్య జరిగిన సమయంలో మంత్రి తన ఇంట్లోనే ఉండటంతో ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. వెంటనే కేంద్ర మంత్రే పోలీసులకు సమాచారాన్ని అందించారని తెలుస్తోంది.
కేంద్ర మంత్రి ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు రివాల్వర్ ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. వినయ్ శ్రీవాస్తవ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని లక్నో డీసీపీ (వెస్ట్) రాహుల్ రాజ్ తెలిపారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 302(హత్య) కింద కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
యువకుడి హత్య వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుండటంతో కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులను వదిలిపెట్టబోమని తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని వెల్లడించారు. అయితే ఆ సమయంలో తన ఇంట్లో ఎవరు ఉన్నారన్న విషయం తనకు తెలియదన్నారు.
తన కుమారుడు వికాస్ కూడా ఆ సమయంలో ఇంట్లో లేడని కేంద్ర మంత్రి చెప్పడం గమనార్హం. తన కోడలు ఢిల్లీలో ఉంటోందని, ఆమె అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేరిందని తెలిపారు. ఘటన జరగడానికి ముందు రోజే తన కుమారుడు వికాస్ తన భార్య దగ్గరకు ఢిల్లీ వెళ్లాడని చెప్పారు. కాగా ఈ వ్యవహారంలో అనుమానాలన్నీ కేంద్ర మంత్రి కుమారుడు వికాస్ చుట్టూనే తిరుగుతున్నాయి. అతడి లైసెన్సుడ్ రివాల్వర్ తోనే హత్య చేయడంతో వేళ్లన్నీ అతడినే నిందితుడు అని అంటున్నాయి.