Begin typing your search above and press return to search.

అదానీ ఫోటోతో స్పృతి పంచ్ కు దిమ్మ తిరిగేలా కౌంటర్

ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో తమను విమర్శలతో టచ్ చేసే వారు ఎంతటి స్థాయిలో ఉన్నా సరే.. కడిగిపారేసే కొత్త కల్చర్ తెర మీదకు వచ్చింది.

By:  Tupaki Desk   |   13 Aug 2023 6:26 AM GMT
అదానీ ఫోటోతో స్పృతి పంచ్ కు దిమ్మ తిరిగేలా కౌంటర్
X

కెలికి అనిపించుకోవటం అంటే ఇదేనేమో. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో తమను విమర్శలతో టచ్ చేసే వారు ఎంతటి స్థాయిలో ఉన్నా సరే.. కడిగిపారేసే కొత్త కల్చర్ తెర మీదకు వచ్చింది. అయితే.. ఇలాంటి ఉదంతాల్లో కెలికే వాళ్లు కాసిన్ని విషయాల్ని ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అలాంటిదేమీ లేకుండా ముందు వెనుకా చూసుకోకుండా ఆరోపణల్ని చేస్తే.. అంతకు మించి అన్నట్లుగా రివర్సులో షాకులు తగలటం ఖాయం. తాజాగా కేంద్ర మంత్రి స్పృతి ఇరానీ పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉంది. అధికార బీజేపీ.. విపక్ష కాంగ్రెస్ కు నడుస్తున్న మాటల యుద్ధంలోకి సోనియమ్మ అల్లుడు రాబర్టు వాద్రా ఉదంతాన్ని తెర మీదకు తీసుకొచ్చారు కేంద్రమంత్రి స్పృతి.

ఇరు పార్టీల మధ్య అదానీ ఎపిసోడ్ హాట్ చర్చగా మారిన వేళ.. తాజాగా కేంద్ర మంత్రి అదానీతో కలిసి ఉన్న సోనియమ్మ అల్లుడు రాబర్టు వాద్రా ఫోటోను చూపిస్తూ.. దీనిపై సమాధానం చెప్పాలంటూ సవాలు విసిరారు. అదానీ విషయంలో రాహుల్ గాంధీకి ఇబ్బంది ఉంటే.. అదానీతో ఆయన బావ రాబర్ట్ వాద్రా ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ పెద్దగా రియాక్టు కాలేదు కానీ.. తన ప్రస్తావన తెచ్చిన కేంద్రమంత్రిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు సోనియమ్మ అల్లుడు.

ఓవైపు మణిపూర్ మండిపోతుంటే.. దాని గురించి మాట్లాడకుండా తన ఫోటోను తీసుకురావటమా? అని ప్రశ్నించారు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా ఫోటో చూపించిన వేళ.. అదానీతో తనకున్న సన్నిహిత సంబంధాల్ని నిరూపించే దమ్ముందా? అని కేంద్రమంత్రిని సవాలు విసిరారు. తన గురించి ఆలోచించటం తగ్గించాలన్న ఆయన.. తనపై విమర్శలు చేయటం ద్వారా తమ అసమర్థతను కప్పిపుచ్చుకోలేరంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

తనపై విమర్శలు చేయటానికి బదులు.. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్.. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై వస్తున్న తీవ్రమైన లైంగిక వేధింపులపై స్పందించాలన్నారు. నెల రోజులకు పైగా బ్రిజ్ కు వ్యతిరేకంగా గళమెత్తిన మహిళా స్టార్ రెజ్లర్లను కేంద్రమంత్రి స్పృతి కలవలేదని ప్రశ్నించారు. ఇక్కడితో ఆగని రాబర్ట్ వాద్రా మరిన్ని అంశాల్ని ప్రస్తావించారు. ‘‘మీ కుటుంబమే ఎన్నో వివాదాల్లో ఉంది. మీ గోవా రెస్టారెంట్.. మీ డిగ్రీల గురించి దేశ ప్రజలకు సమాధానం ఇవ్వాలి. వివిధ ప్రాంతాల్లో ఉన్న మీ థర్డ్ పార్టీ పేర్ల గురించి కూడా తెలుసుకోవాలని దేశంలోని వారంతా అనుకుంటున్నారు’’ అంటూ గుక్క తిప్పుకోకుండా విమర్శనాస్త్రాల్ని సంధించారు. ఇదంతా చూసిప్పుడు.. కేంద్రమంత్రి స్పృతి క్లియర్ చేయాల్సిన పలు అంశాలు ఉన్నాయన్న భావన కలుగక మానదు. ఈ ఎపిసోడ్ ను చూస్తే.. కదిలించి కంప మీద వేసుకున్నట్లుగా అనిపించట్లేదు?