Begin typing your search above and press return to search.

పవన్ కి కేంద్ర మంత్రి...బీజేపీ కండిషన్లు అప్లై...!?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ఆయన కేంద్రంలో మంత్రిగా చేరుతారు అని గత కొన్ని రోజులుగా ప్రచారం ఒక లెవెల్ లో సాగుతోంది.

By:  Tupaki Desk   |   10 March 2024 3:38 AM GMT
పవన్ కి కేంద్ర మంత్రి...బీజేపీ కండిషన్లు అప్లై...!?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ఆయన కేంద్రంలో మంత్రిగా చేరుతారు అని గత కొన్ని రోజులుగా ప్రచారం ఒక లెవెల్ లో సాగుతోంది. దీని మీద ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం కానీ ఆయా పార్టీల నుంచి వస్తున్న భోగట్టా కానీ చూసుకుంటే పవన్ కి కేంద్ర మంత్రిగా ఇస్తారు అనే అంటున్నారు.

అది పెద్ద విషయం కూడా కాదు. కేంద్రంలో బీజేపీ మూడవసారి అధికారంలో వస్తే ఈసారి ఏపీ నుంచి చాలా మందికి చోటు ఉండవచ్చు. ఇప్పటికే జనసేన టీడీపీ బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి మిత్ర పక్షాల కోటాలో మంత్రి పదవులు ఇవ్వవచ్చు.

అయితే ఈ విషయంలో మరో ప్రచారం కూడా సాగుతోంది. జనసేనను బీజేపీలో విలీనం చేసిన తరువాతనే పవన్ కి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారు అని. ఈ విషయమే ఇపుడు వైరల్ అవుతోంది. నిజానికి బీజేపీ ఏపీలో చాలా కాలంగా జనసేనను ఇదే విషయం మీద అడుగుతోంది అని ప్రచారం ఉంది. 2019 ఎన్నికలకు ముందు కూడా బీజేపీ ఇదే ప్రతిపాదించింది అని పవన్ కూడా చాలా సార్లు చెప్పారు.

దానికి తాను అంగీకరించలేదు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇపుడు పొత్తుల వేళ ఈ కీలక సమయంలో మరోమారు విలీనం ప్రచారం జరగడమే చిత్రంగా ఉంది. అయితే రాజకీయాల్లో ఏదీ జరగదు అని చెప్పడానికి వీలు లేదు. అలాగే జరుగుతుంది అని కూడా కచ్చితంగానూ చెప్పలేరు.

బీజేపీ విషయమే తీసుకుంటే పవన్ కళ్యాణ్ విషయంలో వారు ఎందుకో చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారని బీజేపీ నేతల ఆలోచనలు బట్టి తెలుస్తోంది. బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుని 2024లో మూడవ ఫోర్స్ గా రావాలని అనుకున్నారు. కానీ అది కుదరలేదు. మళ్లీ టీడీపీతోనే పొత్తు పార్టీలుగా వస్తున్నారు. . 2014 కాస్తా 2024 అయింది కానీ కమలం పార్టీ రాజకీయ జాతకం అయితే ఏపీలో అసలు మారలేదు.

ఆ దిగులు మాత్రం వారికి అలాగే ఉంది. అదే తెలంగాణాలో చూస్తే 2014 నాటికి 2024 నాటికి బీజేపీ ఎంతో కొంత ఎదిగింది.ఇంకా ఎదిగే క్రమంలో ఉంది. అక్కడ ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ని పక్కన పెట్టడం కూడా జరిగింది. అది బీజేపీకి ఉపకరిస్తోంది. ఏపీలో అలాంటి పరిస్థితినే బీజేపీ ఆశించినా జరగడంలేదు. పైగా మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. బీజేపీ జాతీయ పార్టీగా ఆట ఆడలేకపోతోంది.

దాంతో ఎన్నికల తరువాత ఏపీ రాజకీయాల విషయంలో బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టవచ్చు అని అంటున్నారు. ఈసారి హోరా హోరీగా ఎన్నికలు జరిగినా బీజేపీ పాత్ర కీలకం అవుతుంది. అదే విధంగా కూటమిలో తక్కువ సీట్లు తీసుకున్నా ఎన్నికల అనంతరం బీజేపీ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది అని అంటున్నారు.

దాంతో పాటుగా జనసేనను విలీనం చేసుకుంటుంది అన్న ప్రచారం కూడా సాగుతోంది. మరి జనసేన దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది చూడాల్సి ఉంది. ఏపీలో జనసేన పెట్టి పదేళ్ళు గడచినా అతి తక్కువ సీట్లకు పోటీ చేస్తూ ఉనికి చాటుకునేందుకే సమయం వెచ్చిస్తోంది. దాంతో పవన్ గ్లామర్ బీజేపీ లీడర్ షిప్ అన్న లెక్కలతో ఎన్నికల తరువాత ఏమైనా చేసి ఏపీలో బీజేపీ సంచలన రాజకీయానికి తెర లేపవచ్చు అని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ బీజేపీ వైఖరి చూస్తే ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేక విధానంగా ఉంటుంది.

అందులోనూ ఎక్కువ ప్రాంతీయ పార్టీలు ఉంటే వాటిని ఎలిమినేట్ చేయడంలో లేక విలీనం చేసుకోవడమో చేస్తుంది. అందువల్ల ఏపీలో జనసేన విషయంలో జరుగుతున్న ఈ ప్రచారంలో ఎంత వరకూ నిజం ఉండబోతోంది అన్నది తెలియాలీ అంటే ఎన్నికలు ముగిసేంతవరకూ చూడాల్సిందే.