వైరల్: స్మోకింగ్ ఆపడం కోసం భర్త తలకు బోను... తాళం భార్య చేతిలో!
దీనికి సంబంధించిన పిక్స్ మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి!
By: Tupaki Desk | 23 Jan 2025 6:01 PM GMTవ్యసనాలందు ధూమపానం మరింత వేరయా అంటుంటారు! ఉన్న వ్యసనాల్లో, దురలవాట్లలో ఏదైనా మానుకోగలరు కానీ ధూమపానాన్ని మానుకోవడం అంత సులువు కాదని చెబుతుంటారు. ఈ విషయంలో ఎవరి స్వానుభవాలు వారికుంటాయనీ అంటారు. కొంతమంది మానేయాలని సీరియస్ గా ట్రై చేసినా.. ఏదో ఒక బలహీన క్షణంలో నాలుక లాగేస్తుందని చెప్పి ధమ్ము లాగేస్తుంటారు.
మరికొంతమంది పిల్లల బర్త్ డే రోజు వారికి మాట ఇస్తుంటారు.. వారికి నెక్స్ట్ బర్త్ డే వచ్చే లోపు కొంతమంది మళ్లీ మొదలుపెడితే, మరికొంతమంది కనీసం ఆ నెల కూడా దాటనివ్వకుండా ముందుకు వెళ్తుంటారు. ఇక ఇంకొంతమంది పెళ్లి రోజున భార్యకు మాటిస్తుంటారు.. అక్కడ నుంచి ఆమెకు తెలియకుండా ఉండటం కోసం ఎన్నో జామ ఆకులు తెంచేస్తుంటారు.. బబుల్ గమ్ రేపర్లు చింపేస్తుంటారు.
ఈ సమయంలో.. తాజాగా ఓ వ్యక్తి ఇవన్ని అనుభవాలు అయిపోయో ఏమో కానీ.. ఓ సరికొత్త ఆలోచన చేశాడు. మరి అది ఆయనకే వచ్చిన ఆలోచనా.. లేక, శ్రీమతి మస్థిష్కంలోంచి ఉద్భవించిన ఐడియానా అనేది తెలియదు కానీ.. తలకు ఓ బోను చేయించుకుని, బిగించుకున్నాడు. ఏదైనా తినేటప్పుడు ఆ బోన్ ఓపెన్ చేయడం, తర్వాత లాక్ పెట్టడం చేస్తున్నారు. ఆ తాళం చెవి శ్రీమతి చేతిలో ఉంటుంది.
వాస్తవానికి దీనికి సంబంధించిన విషయాలు 2013లోని వార్తాపత్రికల్లో వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మరోసారి దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో భాగంగా... ఇబ్రహీం యుసెల్ అనే ఈ టర్కీష్ వ్యక్తి సిగరెట్ మానేందుకు ఈ ఇనుప ఊసలతో చేసిన హెల్మెట్ ఆకారంలో ఉన్న బోను ను పంజరంలా పెట్టుకుంటున్నాడు. ఇతడు సుమారు 26 ఏళ్లుగా ధూమపానం చేస్తున్నాడంట.
ఈ క్రమంలో డైలీ సుమారు రెండు ప్యాకెట్లు తక్కువ కాకుండా ఊది అవతల పాడేసేవాడంట. ఇతను కూడా చాలా మంది లాగానే తన ముగ్గురు పిల్లల పుట్టిన రోజులకు, వివాహ వార్షికోత్సవాలకు మాట ఇవ్వడం.. అనంతరం వీలైనంత తక్కువ సమయంలో తదుపరి ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం చేసేవాడంట. ఈ నేపథ్యంలోనే ఆ అలవాటును మానుకోవడానికి ఈ ఏర్పాటు చేసి.. దాని తాళం భార్య చేతిలో పెట్టారట!
అయితే... ఇంత చేసినా ధూమపానం మానగలిగాడా.. లేక, ఆ ఊసల మధ్యలో నుంచి ఏమైనా ప్రయత్నిస్తున్నాడా అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు కానీ... దీనికి సంబంధించిన పిక్స్ మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి! "కొత్త ప్రయత్నం.. ప్రయత్నించి చూడండి" అనే కామెంట్లు ఈ సందర్భంగా దర్శనమిస్తున్నాయి!