హెచ్1-బీ ప్రోగ్రామ్ ను మార్చే 'ఫైనల్ రూల్' విడుదల!
అవును... జో బిడెన్ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ కు సంబంధించిన కొత్త నిబంధనను ప్రకటించింది.
By: Tupaki Desk | 18 Dec 2024 4:09 AM GMTహెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ అవసరాలను స్పష్టం చేయడం.. పిటిషనర్లు, లబ్ధిదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడం.. ఈ ప్రోగ్రామ్ సమగ్రత చర్యలను బలోపేతం చేయడం ద్వారా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ ను ఆధునీకరించడానికి డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీ.హెచ్.ఎస్.) తుది నియమాన్ని ప్రకటించింది!
అవును... జో బిడెన్ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ కు సంబంధించిన కొత్త నిబంధనను ప్రకటించింది. ఇది ప్రచురణ తర్వాత 30 రోజుల్లో అమల్లోకి వస్తుందని తెలిపింది. అంటే... ఈ తుది నియమం డిసెంబర్ 18 - 2024 న ప్రచురించబడుతుండగా.. జనవరి 17 - 2025 నుంచి అమల్లోకి వస్తుందన్నమాట!
ఈ సందర్భంగా స్పందించిన యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూ.ఎస్.సీ.ఐ.ఎస్.) డైరెక్టర్ ఉర్ ఎం జద్దౌ... హెచ్-1బీ ప్రోగ్రాం ను 1990లో కాంగ్రెస్ రూపొందించిందని.. అభివృద్ధి చెందుతున్న అమెరికా అర్థిక వ్యవస్థకు మద్దతుగా దీన్ని ఆధునీకరించాల్సిన అవసరం లేదని అన్నారు.
ఇదే సమయంలో అమెరికా యజమానులు తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులను నియమించుకొవడానికి.. ప్రపంచ మార్కెట్ లో పోటీని కొనసాగించేందుకు వీసా విధానం సరళీకృతం చేయబడిందని తెలిపారు.
ఇదే సమయంలో... అత్యంత నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల నియామకానికి హెచ్-1బీ వీసా ఒక ముఖ్యమైన ప్రమాణం అని.. ఈ నేపథ్యంలో వీసా నిబంధనలను సులభతరం చేసి కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చిందని.. ఇది దేశవ్యాప్తంగా కమ్యూనిటీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మేయర్కాస్ తెలిపారు.
డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీ.హెచ్.ఎస్.) ప్రకారం... ఎఫ్-1 వీసాలు ఉన్న విద్యార్థులు.. ఆ వీసాలను హెచ్-1బీకి మార్చడానికి కొత్త నియమం అనుమతిస్తుంది. ఇదే సమయంలో.. దీంతో చట్టపరమైన స్థితి, ఉద్యోగ అధికారంలో అడ్డంకులను నివారించవచ్చు. ఈ కొత్త నిబంధనలు సులబంగా మర్పులకు అనుమతిస్తాయి.
ఇది యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూ.ఎస్.సీ.ఐ.ఎస్.) గతంలో హెచ్-1బీ వీసాల కోసం ఆమోదించబడిన మరింత మంది వ్యక్తుల కోసం దరఖాస్తులను మరింత త్వరగా ప్రాసెస్ చేయడానికి అనుమతిస్తుంది.
కాగా.. గత ఏడాది అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్ ఇండస్ట్రీలో ప్రధానంగా ఉపయోగించే స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసాల కోసం డిగ్రీ అవసరాలతో సహ అర్హత ప్రమాణాలను సర్దుబాటు చేసే డ్రాఫ్ట్ నిబంధనలను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. కొత్త ఏడాది ప్రారంభానికి ముందు తిరిగి మర్పులకు శ్రీకారం చుట్టడం గమనార్హం.
ఇక... జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అంతకంటే ముందు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఈ వీసా విధానం కోసం కొత్త నిబంధనలను ప్రకటించారు. ఇవి సంక్షిష్టతను పరిష్కరించడానికి కృషి చేస్తాయని చెబుతున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే... జోబైడెన్ పరిపాలన తాజా చర్య ఏమిటంటే... చట్ట ప్రకారం అమెరికన్ కార్మికుల రక్షణకు కట్టుబడి, యజమానులపై అనవసరమైన భారాన్ని తగ్గించేందుకే ఈ కొత్త నిబంధనలు అమలు చేయడం అని అంటున్నారు.