Begin typing your search above and press return to search.

నిరుడు టర్కీ.. తుర్కియే.. నేడు.. భారత్? మార్పు మీ ఇష్టమన్న ఐక్యరాజ్య సమితి

ఇండియా పేరును భారత్ గా మార్చే అంశం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగానూ చర్చనీయాంశం అవుతుందనడంలో సందేహం లేదు

By:  Tupaki Desk   |   7 Sep 2023 6:44 AM GMT
నిరుడు టర్కీ.. తుర్కియే.. నేడు.. భారత్? మార్పు మీ ఇష్టమన్న ఐక్యరాజ్య సమితి
X

75 ఏళ్ల స్వాతంత్ర్యం అనంతరం భారత దేశం ఓ కీలక విషయంపై ప్రపంచం ముంగిట నిలిచింది. బహుశా స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో పాకిస్థాన్ తో కశ్మీర్ వివాదం సందర్భంగా తప్పితే ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రస్తావన అరుదనే చెప్పాలి. అయితే, ఇది వివాదాలకు సంబంధించిన అంశాల్లోనే. ఇతర అంశాల పరంగా మన దేశం పాత్ర ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడూ కీలకమే. ఎందుకంటే జనాభా పరంగా పెద్ద దేశం. వనరుల పరంగా కీలక దేశం. అన్నిటికి మించి శాంతిని కోరుకునే సమున్నత ఉద్దేశం. చరిత్రలో ఇప్పటివరకు ఏ దేశంపైనా భారత్ దండెత్తలేదు. ఇదొక్కటి చాలు.. భారత్ విశిష్టతను చాటేందుకు.

ప్రపంచానికి తెలియాలంటే..

ఇండియా పేరును భారత్ గా మార్చే అంశం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగానూ చర్చనీయాంశం అవుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. భారత్ ఈ వారాంతంలో ప్రతిష్ఠాత్మక జి-20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల అధ్యక్షులు లేదా వారి ప్రతినిధులు పాల్గొనే సదస్సు కావడంతో ప్రపంచం చూపంతా దీనిపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే వారికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా 'ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌' పేరిట రాష్ట్రపతి నుంచి ఆహ్వానాలు వెళ్లాయి.

ఇక్కడే మన దేశం పేరును మారుస్తున్నారా? అనే చర్చకు బీజం పడింది. కాగా, దేశం పేరు మార్పుపై రాజకీయ వివాదం కూడా మొదలైంది. వాస్తవానికి మన దేశం పేరు మారినట్లు ప్రపంచానికి తెలియాలంటే దానికి ఓ విధానం ఉంది. భౌగోళికంగా ఒక దేశాన్ని గుర్తించేందుకు ఐక్యరాజ్య సమితి (యూఎన్) ఆమోదమే గీటురాయి. పేరు మార్పు విషయంలోనూ యూఎన్ నిర్ణయమే ప్రామాణికం. కాగా, ఇండియా పేరును భారత్ గా మార్చే అంశంపై ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది.

నిరుడు టర్కీ.. తుర్కియేగా

అటు యూరప్.. ఇటు పశ్చిమాసియా మధ్య వారధిలా ఉండే దేశమే తుర్కియే. ముస్లిం సంప్రదాయానికి, ఆధునికతకు రెండింటికీ పేరుగాంచిన దేశమిది. ఒట్టోమాన్ సామ్రాజ్యపు దేశమైన టర్కీ నిరుడు తన దేశం పేరును తుర్కియేగా మార్చుకుంది. దీనకి ఐక్యరాజ్య సమితి సైతం ఆమోద ముద్ర వేసింది. తాజాగా ఇండియా పేరు కూడా భారత్ గా మారుస్తారన్న అంచనాల రీత్యా ఐక్యరాజ్య సమితి స్పందన ఏమిటన్నది కీలకంగా మారింది.

అభ్యర్థనలు వస్తే పరిగణిస్తాం..

పేర్ల మార్పుపై దేశాల నుంచి అభ్యర్థనలు వస్తే.. తాము పరిగణనలోకి తీసుకుంటామని సమితి తాజాగా స్పష్టం చేసింది. 'ఇండియా' అనే పేరు ఇంగ్లింష్ లోనూ భారత్‌ గా మారుతుందా? అంటూ సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌, డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ స్పందించారు. తుర్కియే ఉదాహరణను వివరించారు. తుర్కియే పేరుపై ఆ దేశ ప్రభుత్వం పంపిన అభ్యర్థనను స్వీకరించి సానుకూలంగా స్పందించామని చెప్పారు. ఏ దేశమైనా ఇలా అధికారికంగా అభ్యర్థనలు పంపిస్తే పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. కాగా, ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం 193 సభ్య దేశాలున్నాయి.