అమెరికాలో గన్ కల్చర్.. ఎప్పటి నుంచి ఎప్పటి దాకా?!
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి పేట్రేగిపోయింది. తాజాగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం తర్వాత
By: Tupaki Desk | 14 July 2024 4:38 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి పేట్రేగిపోయింది. తాజాగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం తర్వాత.. ఈ వ్యవహారంపై దేశంలోనే కాకుండా.. చుట్టుపక్కల ఉన్న కెనడా తదితర దేశాల్లోనూ చర్చగా మారింది. అసలు అమెరికాలో గన్ కల్చర్ ఎప్పటి నుంచి వచ్చింది? అసలు ఎలా వచ్చిందనేది ఆసక్తికర విషయం. భారత్ సహా.. అన్ని ప్రజాస్వామ్య దేశాల్లోనూ వ్యక్తిగత తుపాకీ వినియోగానికి లైసెన్సు అనుమతులు ఉన్నాయి. కానీ, ఇవి అత్యంత కఠినంగా ఉంటాయి.
తుపాకీ వినియోగించుకోవాలని భావించే వారి పూర్వాపరాలు, ఆస్తులు, సమాజంలో వారి హోదా వంటి అనేక పారామీటర్లను పరిగణనలోకి తీసుకుని.. అనుమతులు ఇస్తారు. అంతేకాదు.. ప్రతినెలా ఆయా అనుమతులను సమీక్షిస్తారు. ఇక, లైసెన్సు తీసుకున్నవారు కూడా.. ప్రతి ఆరు మాసాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. ఇలా, ఇతర దేశాల్లో నిబంధనలు ఉండగా.. అమెరికాలో మాత్రం ఇలాంటి నిబంధనలు లేవు. కేవలం అనుమతిపొందితే చాలు. దీనికి స్వల్ప రీజన్లు చూపిస్తే.. ఇచ్చేస్తారు.
అమెరికాలో తుపాకీ సంస్కృతి 1934 నుంచి పెరిగింది. ప్రభుత్వ అధికారుల నుంచి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా.. వారి ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండా.. సమాజంలో హోదాతోనూ పనిలేకుండా.. తుపాకులు పొందేందుకు అవకాశం ఉంది. భారత్ వంటి దేశాల్లో కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. కానీ, అమెరికాలో స్థానిక ప్రభుత్వాలే .. వీటిని అనుమతిస్తాయి. అమెరికా రాజ్యాంగానికి చేసిన రెండవ సవరణ ద్వారా తుపాకీ కలిగి ఉండడం అనేది చట్టబద్ధ హక్కుగా మారిపోయింది. ఆయుధాలను ఆత్మరక్షణ, వేట, వినోదం కోసం ఉపయోగిస్తారు. కానీ, భారత్‌లో అలా లేదు.
ఎప్పుడు వచ్చింది?
1934లో అమెరికా జాతీయ ఆయుధాల చట్టం చట్టసభలో ఆమోదం పొందింది. సెయింట్ వాలెంటైన్స్ డేలో 1929లో జరిగిన ఊచకో, 1933లో అధ్యక్షుడిగా ఎన్నికైన ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ హత్యకు ప్రయత్నించడం వంటి కారణాల నేపథ్యంలో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం జాతీయ ఫెడర్ ఏజెన్సీ తుపాకీ లైసెన్సులు ఇవ్వడం ప్రారంభించింది. అయితే.. తర్వాత తర్వాత.. దీనిని బాగా సడలించారు. వ్యక్తిగత వినియోగానికి సంబంధించి ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. నిబంధనలు కూడా సరళతరం చేశారు.
దిగువ కోర్టు సమర్థన
అమెరికాలో తుపాకీ సంస్కృతిపై 1938లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. స్థానిక కోర్టుల్లో నిషేధం విధించాలంటూ.. పిటిషన్లు కూడా పడ్డాయి. వీటి విచారణ సమయంలో ప్రభుత్వాలు.. తుపాకీ సంస్కృతిని సమర్ధిస్తూ.. వాదనలు వినిపించాయి.1938లో, యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అర్కాన్సాస్ యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ మిల్లర్ కేసులో తుపాకీ సంస్కృతిని రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. అయితే, ప్రతివాది మిల్లెర్ చిన్నపాటి డబుల్-బారెల్ షాట్‌గన్ అసలు భారీ ఆయుధం కాదని, తద్వారా ఫెడరల్ చట్టాల ఉల్లంఘన జరగలేదని సర్కారే వాదనలు వినిపించింది. అంతేకాదు.. రాజ్యాంగానికి చేసిన రెండవ సవరణ ద్వారా చట్టబద్ధమేనని తెలిపింది. దీనికి కోర్టులు కూడా అంగీకరించాయి. ఫలితంగా 1938 తర్వాత.. ఇంటికో తుపాకీ స్థానంలో వ్యక్తికో తుపాకీ సంస్కృతి వచ్చేసింది. దీనిని కట్టడి చేసేందుకు ట్రంప్ ప్రయత్నించినా.. గత ఆయన హయాలో భంగపడ్డారు. ఇప్పుడు అదే పరిస్థితి ఆయనకు ఎదురు కావడం గమనార్హం.