అగ్రరాజ్యంలో గ్రీన్ కార్డ్ కష్టాలు... 4 లక్షలమంది ఇండియన్స్ ఎదురుచూపులు!
అమెరికాలో పౌరసత్వానికి తొలి మెట్టుగా భావించే గ్రీన్ కార్డు పొందడం చాలా మందికి పెద్ద కల అనే సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 7 Sep 2023 9:00 AM GMTఅమెరికాలో పౌరసత్వానికి తొలి మెట్టుగా భావించే గ్రీన్ కార్డు పొందడం చాలా మందికి పెద్ద కల అనే సంగతి తెలిసిందే. అగ్రారాజ్యంలో స్థిరపడాలనే కోరికకు ఇది తొలి మెట్టు కావడంతో దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు ఎన్నారైలు. ఈ సమయంలో ఈ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయుల లిస్ట్ తాజాగా వైరల్ గా మారింది.
అవును.. ఇప్పుడు ఎంతోమంది ప్రవాస భారతీయ ఉద్యోగులు గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా క్యాటో సంస్థకు చెందిన డేవిడ్ జే బయర్ జరిపిన అధ్యయనంలో దీనికి సంబంధించిన కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా సుమారు 10.5 లక్షల మందికిపైగా ప్రవాస భారతీయ ఉద్యోగులు గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది.
తాజా అధ్యయనం ప్రకారం ఈ ఏడాది నాటికి అమెరికాలో ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు కోసం సుమారు 18 లక్షల మంది ఎదురు చూస్తున్నారని.. అందులో 63 శాతానికిపైగా అంటే 10.5 లక్షల మంది భారతీయులే ఉన్నారని తెలిసింది. భారతీయుల అనంతరం చైనా నుంచి అమెరికా వెళ్లిన వారు ఉన్నారని అంటున్నారు. వీరి సంఖ్య సుమారు 2.5 లక్షలని తాజా అధ్యయనం తెలిపింది.
అయితే ఇంతమంది ఎందుకు క్యూలో ఉన్నారు.. ఇంతమందిని అగ్రరాజ్యం ఎందుకు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టింది.. వీరికి ఎప్పటిలోపు ఈ గ్రీన్ కార్డ్ రావొచ్చు అనే ప్రశ్నలు ఈ అధ్యయనం అనంతరం ఆన్ లైన్ వేదికగా చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే దీనికో లెక్క ఉండటంతో చాలా మంది తమ జీవిత కాలంలో ఈ ఛాన్స్ పొందుతారో లేదో అనేది అతిపెద్ద ప్రశ్నగా మిగిలింది.
కారణం... శాశ్వతంగా అమెరికాలో ఉండేందుకు వలసవచ్చిన వారికి ఇచ్చే ఈ గ్రీన్ కార్డుపై దేశాల వారీగా పరిమితి ఉంది. ఇందులో భాగంగా ఏటా ఒక్కో దేశానికి 7 శాతానికి మించి గ్రీన్న్ కార్డులు జారీ చేసే అవకాశం లేదు. ఈ లెక్కన చూసుకుంటే మొత్తంగా 18 లక్షల మంది సంగతి కాసేపు పక్కనపెడితే... అందులో 10.5 లక్షల భారతీయులకు ఈ గ్రీన్ కార్డ్ రావాలంటే ఎంత సమయం పడుతుందనేది ఎవరికీ తెలియని పరిస్థితి!
ఈ పరిస్థితుల్లో కొత్తగా దరఖాస్తు చేయాలనుకునేవారు జీవిత కాలం కంటే అధికంగా వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోపక్క ఇప్పటికే 4 లక్షల మంది జీవిత కాలం వేచి ఉన్నా వచ్చే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు! దీంతో... అగ్రరాజ్యంలో శాస్వత పౌరసత్వం ఇప్పట్లో కష్టమనే అభిప్రాయం అందరిలోనూ వచ్చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... ఈ ఏడాది మార్చి నాటికి 80,324 మంది ఉద్యోగులకు సంబంధించిన గ్రీన్ కార్డుల పిటిషన్లు పెండింగ్ లో ఉండగా... వీరి భార్యా పిల్లలతో కలిపి మొత్తం 1,72,635గా ఉన్నాయి. ఇదే సమయంలో మరో 13 లక్షల మంది దరఖాస్తులు వెయిటింగ్ లిస్ట్ లో ఉండగా... 2,89,000 మంది దరఖాస్తులు అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ పేరుతో పెండింగ్ లో ఉన్నాయి.
పేరు ఏదైనా, లిస్ట్ మరేదైనా.. పెండింగులో ఉన్న దరఖాస్తుల సంగతి కాసేపు పక్కనపెడితే... గ్రీన్ కార్డ్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న భారతీయులు సుమారు 134 సంవత్సరాలు వేచి ఉండాలని చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే... మొత్తం దరఖాస్తుల్లో సుమారు 4,24,000 మంది జీవిత కాలంలో గ్రీన్ కార్డును చూడలేకపోవడం కన్ ఫాం కాగా... ఇందులో 90శాతం మంది భారతీయులే ఉండటం గమనార్హం!