Begin typing your search above and press return to search.

ఇన్ ఫ్లుయెన్సర్ లూ జాగ్రత్త... సోషల్ మీడియా పాలసీకి కేబినెట్ ఆమోదం!

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ లతో సహా ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో కంటెంట్ కు నియంత్రణ

By:  Tupaki Desk   |   28 Aug 2024 2:30 PM GMT
ఇన్ ఫ్లుయెన్సర్ లూ జాగ్రత్త... సోషల్ మీడియా పాలసీకి కేబినెట్ ఆమోదం!
X

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ లతో సహా ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో కంటెంట్ కు నియంత్రణ లేకుండా పోతుందని.. దీనికి సరైన విధివిధానాలు లేకపోవడంతో అభ్యంతరకరమైన కంటెంట్ విపరీతంగా విస్తరిస్తుందని.. ఫిల్టర్ లేకుండా తప్పుడు ప్రచారాలు జనాల్లోకి ఈజీగా వెళ్లిపోతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విషయంలో సోషల్ మీడియాలోని తప్పుడు ప్రచారాల వల్ల ఇబ్బందిపడ్డ బాధితులకు దాని ఎఫెక్ట్ బాగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో కంటెంట్ ను నియంత్రించాలనే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త సోషల్ మీడియా విధివిధానానికి ఆ రాష్ట్ర క్యాబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది.

అవును... ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ సహా అన్ని ఫ్లాట్ ఫామ్ లలో కంటెంట్ ను నియంత్రించాలనే లక్ష్యంతో కొత్త సోషల్ మీడియా పాలసీకి యూపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పాలసీలో అభ్యంతరకరమైన సోషల్ మీడియా కంటెంట్ ను పరిష్కరించడానికి విధివిధానాలను విడుదల చేసింది!

తాజాగా విడుదల చేసిన కొత్త పాలసీ ప్రకారం... దేశ వ్యతిరేక కంటెంట్ ను పోస్ట్ చేయడం తీవ్రమైన నేరం.. దానికి మూడు సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇదే క్రమంలో... అశ్లీలత, లేదా.. పరువుకు నష్టం కలిగించే విషయాలను ప్రచారం చేస్తే క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంది.

ఈ సమయంలో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లను దుర్వినియోగం చేయడం వల్ల కలిగే నష్టాన్ని చట్టపరంగా ఎదుర్కోడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఈ సమయంలో ఈ పాలసీ విధానంలో ప్రకటనలను నిర్వహించడానికి ప్రభుత్వం "వి-ఫారమ్" అనే డిజిటల్ ఏజెన్సీని రూపొందించింది.

ఈ ఏజెన్సీ... సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో చెల్లింపుల పరిమితులను నిర్దేశిస్తుంది. ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టా కోసం గరిష్టంగా నెలవారీ చెల్లింపుల పరిమితులను వరుసగా రూ.5 లక్షలు, రు.4 లక్షలు, రూ.3 లక్షలకు నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో... యూట్యూబ్ వీడియోలు, షార్ట్ లు, పాడ్ క్యాస్ట్ ల చెల్లింపు పరిమితులు విధించారు.

ఇందులో భాగంగా యూట్యూబ్ కు రూ.8 లక్షలు, షార్ట్స్ కు రూ.7 లక్షలు, పాడ్ క్యాస్ట్ లకు రూ.4 లక్షలుగా పరిమితి విధించారు.

కాగా... ఇటీవల కాలంలో కొంతమంది ఇన్ ఫ్లుయెన్సర్లు కంటెంట్ కోసం విపరీతమైన చేష్టలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ప్రమాదకర స్టంట్ లు చేస్తున్నారు, జుగుప్సకరమైన కార్యక్రమాలకు తెరలేపుతున్నారు. వీటిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో.. సోషల్ మీడియాపైనా నిఘా ఉండాల్సిన అవసరం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే యోగి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.