ఆ ఎన్నికలు కేసీఆర్ కు చావోరేవో!
కానీ త్వరలో జరగబోయే ఓ ఉప ఎన్నిక మాత్రం కేసీఆర్‌ను టెన్షన్ పెడుతోందని టాక్. ఈ ఎన్నికలో ఓటమి పాలైతే మరింత అప్రతిష్ఠ మూటగట్టుకోవడం ఖాయమనే చెప్పాలి.
By: Tupaki Desk | 8 April 2024 1:30 PM GMTఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నో ఎన్నికలు చూశారు. అద్భుతమైన విజయాలు సాధించారు. వరుసగా రెండు సార్లు తెలంగాణ సీఎంగా పని చేశారు. అలాంటి ఓ దిగ్గజ లీడర్‌కు ఉప ఎన్నిక అంటే చాలా చిన్న విషయం. కానీ త్వరలో జరగబోయే ఓ ఉప ఎన్నిక మాత్రం కేసీఆర్‌ను టెన్షన్ పెడుతోందని టాక్. ఈ ఎన్నికలో ఓటమి పాలైతే మరింత అప్రతిష్ఠ మూటగట్టుకోవడం ఖాయమనే చెప్పాలి. అదే కంటోన్మెంట్ ఉప ఎన్నిక. ఇక్కడ బీఆర్ఎస్ విజయం కోసం కేసీఆర్ శాయశక్తులు ఒడ్డుతున్నారు.
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి దివంగత నాయకుడు సాయన్న కూతురు లాస్య నందిత బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. కానీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నిక కోసం నందిత సోదరి నివేదితను అభ్యర్థిగా నిలబెట్టేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఉగాది తర్వాత అధికారికంగా అభ్యర్థిని ప్రకటించనున్నారు. ఎలాగైనా ఇక్కడ నివేదితను గెలిపించుకుని, ఈ అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే కేసీఆర్ చూస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికలతో పాటే జరిగే ఈ ఉప ఎన్నిక సాధారణంగా అయితే కేసీఆర్ కు చాలా చిన్న విషయం. కానీ ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడిదే చావోరేవోగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సింపతీ ఉన్నా ఇక్కడ గెలవలేకపోతే మాత్రం అది పార్టీని ఇంకా దెబ్బతీసే అవకాశం ఉంది. శ్రీగణేష్‌ను అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ ఇక్కడ విజయం కోసం ఫైట్ చేస్తోంది.
ఇందులో కాంగ్రెస్ నెగ్గితే అప్పుడు రేవంత్‌కు మరిన్ని మార్కులు పడతాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి నాయకులు కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నారు. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోతే ఆ వలసలు ఇంకా ఎక్కువవుతాయి. అదే బీఆర్ఎస్ గెలిస్తే.. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత వచ్చిందని చెప్పడానికి ఓ అవకాశం కేసీఆర్‌కు దొరుకుతుంది. ఆ పార్టీ అధికారంలో ఎక్కువ కాలం ఉండదని చాటిచెప్పేందుకు ఛాన్స్ ఉంటుందని కేసీఆర్ అనుకుంటున్నారని టాక్. మరి ఎన్నికలో ఎవరు గెలుస్తారో?