చిరు.. ఆ విషయంలో నేను ఫెయిలయ్యా: ఉపేంద్ర
కన్నడ నటుడు ఉపేంద్ర.. యుఐ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 16 Dec 2024 6:54 AM GMTకన్నడ నటుడు ఉపేంద్ర.. యుఐ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. నటిస్తూ దర్శకత్వం వహించిన ఆయన.. డిసెంబర్ 20వ థియేటర్లలో సందడి చేయనున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రూపొందించిన ఆ సినిమా.. తెలుగుతోపాటు వివిధ భాషల్లో రిలీజ్ కానుంది.
తెలుగు మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఉపేంద్ర.. ఇక్కడ కూడా ఫుల్ జోష్ లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత ఎస్కేఎన్ విచ్చేసి బెస్ట్ విషెస్ తెలిపారు.
అయితే యుఐ మూవీ కథాంశం చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. ప్రేక్షకులు దాన్ని డీకోడ్ చేయగలరని నమ్ముతున్నానని ఆయన స్పష్టం చేశారు. సినిమా ప్రారంభ సన్నివేశం ప్రేక్షకులకు చాలా షాకింగ్ గా అనిపిస్తుందని చెప్పి అంచనాలు పెంచారు. మూవీలో రెండు వేర్వేరు క్లైమాక్స్ లు ఉంటాయని వస్తున్న రూమర్స్ పై స్పందించారు.
అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. సినిమాలో ఒకే ఒక్క క్లైమాక్స్ ఉంటుందని చెప్పారు. కంటెంట్ చాలా బలంగా ఉందని, ఆడియన్స్ కనీసం రెండుసార్లు చూడాలనుకుంటారని తెలిపారు. తెలుగు విడుదలకు మద్దతు ఇచ్చినందుకు గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ కు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తాను 90ల్లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్నట్లు ఉపేంద్ర తెలిపారు. స్క్రిప్ట్ పట్టుకుని ఏడాది పాటు తిరిగానని చెప్పారు. కానీ కుదరలేదని వెల్లడించారు. ఆ సమయంలో టాలీవుడ్ యాక్టర్స్.. స్టోరీ గురించి ఎంత డీప్ గా ఆలోచిస్తారో అర్థమైందని పేర్కొన్నారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారని కొనియాడారు.
అలా తాను కథతో చిరంజీవిని ఇంప్రెస్ చేయడంలో విఫలమయ్యానని తెలిపారు. ఆ తర్వాత స్క్రిప్ట్ రాసే తన విధానంలో చేంజ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ.. ప్రపంచ స్థాయిలో షేక్ చేస్తుందని కొనియాడారు. రూ.1000 కోట్ల నుంచి రూ.2000 కోట్ల బాక్సాఫీస్ వైపు వెళ్తుందని అన్నారు. టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ముందు ఉంటారని వ్యాఖ్యానించారు.