నాలుకకు - మెదడుకు మధ్య ఫిల్టర్ లేదు... ఉపేంద్ర ఉక్కిరిబిక్కిరి!
సోషల్ మీడియా లైవ్ లో అభిమానులతో మాట్లాడుతూ ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఉపేంద్రపై వారంతా ఫైరవుతున్నారు
By: Tupaki Desk | 15 Aug 2023 7:06 AM GMT"నా నాలుకకు - మెదడుకు మధ్య ఫిల్టర్ లేదు, ఏది అనుకుంటే అది మాట్లాడడం నా నైజం" అని ఉపేంద్ర ఒక సినిమాలో డైలాగ్ చెప్పారు. మరి అదే ఊపులో కొనసాగించారో.. లేక, అది నిజమో తెలియదు కానీ తాజాగా సోషల్ మీడియా లైవ్ లో కూడా అలా ఫిల్టర్ లేనట్లే మాట్లాడారు! దీంతో సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
అవును... సోషల్ మీడియా లైవ్ లో అభిమానులతో మాట్లాడుతూ ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఉపేంద్రపై వారంతా ఫైరవుతున్నారు. ఈ సమయంలో బెంగళూరులో రెండుచోట్ల ఎఫ్..ఐ.ఆర్ నమోదు కాగా.. మండ్య, కోలారులో కూడా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి ఉపేంద్రకు వ్యతిరేకంగా ధర్నాలు కూడా జరిగాయి.
ఇలా ఈ వ్యవహారంపై పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఉపేంద్ర క్షమాపణలు కోరారు. అనంతరం తన ట్విటర్ ఖాతాను లాక్ చేసుకొన్నారు. ఈ సమయంలో మొదట చెన్నమ్మ అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు రాగా, వారు విచారణ కోసం ఉపేంద్రకు నోటీస్ ఇవ్వగానే ఆయన ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారని తెలిసింది.
దీంతో... ఉపేంద్రకు చెందిన రెండు ఇళ్లు, మొబైల్ వాట్సాప్ లకు నోటీస్ లు పంపినట్లు పోలీసులు తెలిపారు. విచారణకు రావాలని బెంగళూరులోని ఉపేంద్ర ఇంటికి పోలీసులు వెళ్లగా ఆయన లేరని తెలిసింది. అనంతరం తనపై రెండు చోట్ల నమోదైన కేసులను రద్దు చేయాలని ఉపేంద్ర హైకోర్టు మెట్లెక్కారు.
ఈ సమయంలో ఉపేంద్ర అన్ని వర్గాలను గౌరవించే మంచి మనిషని.. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం ఆయనకు లేదని.. ఆయన తరుపు న్యాయవాది పేర్కొన్నారు. వాదనలను ఆలకించిన జడ్జి.. ఎఫ్.ఐ.ఆర్.పై స్టే విధించారు. అనంతరం సర్కారుకు, ఇతర పక్షాలకు తమ వైఖరి తెలపాలని నోటీసులు జారీ చేశారు.
ఈ సమయంలో సామాజిక సంక్షేమ మంత్రి మహదేవప్ప ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలపై ఫైరయ్యారు. పేదరికం వేరు, కుల అసమానతలు వేరు.. ఇలాంటి విషయాలను తెలుసుకోకుండా నటుడు ఉపేంద్ర మాట్లాడటం మంచిది కాదని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా కూడా జాతి పేరుతో అవమానిస్తుండటం దారుణం అని ఆయన ఆన్నారు.