Begin typing your search above and press return to search.

ఫేక్ పెళ్లికి వరుడే ఉండాలా ఏమిటి?... రంగంలోకి పోలీసులు!

ఈ పథకం ద్వారా వివాహం చేసుకున్న నిరుపేద కుటుంబాల యువతీ యువకులకు ఆర్థికసాయం కింద రూ.51,000 అందజేస్తోంది.

By:  Tupaki Desk   |   2 Feb 2024 12:30 AM GMT
ఫేక్  పెళ్లికి వరుడే ఉండాలా ఏమిటి?... రంగంలోకి పోలీసులు!
X

గత కొంతకాలంగా పేద ఇళ్లల్లోని అమ్మాయిల వివాహాలకు ప్రభుత్వాలు ఆర్ధిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్వం మహారాజులు, సంస్థానాధీశులు, పెద్ద పెద్ద దేవాలయాల ధర్మ కర్తలు ఇలాంటి పనులు చేసేవారిని చెబుతుంటారు. అయితే... ఇటీవల కాలంలో ఇవన్నీ ప్రభుత్వమే చేస్తుంది! ఈ పథకాలకు మతాలవారీగా రకరకాల పేర్లు పెడుతుంది!! అయితే... ఈ ప్రభుత్వ సొమ్ముకు ఆశపడి... ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకోవడానికి రంగంలోకి దిగారు వందలాది మంది యువతులు!

అవును... సర్కారు వారి సొమ్మంటే అందరికీ ఆశే అని అంటుంటారు. అడిగేవాడు లేకపోతే అంతకుమించిన అదృష్టం ఉండదనే కామెంట్లూ చేస్తుంటారు. ఈ క్రమంలో మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకాన్ని దుర్వినియోగం చేసే పనికి పూనుకున్నారు కొంతమంది యువతులు. అదేంటి.. అధికారుల అండదండలు లేకుండా అదేలా సాధ్యం అంటారా? సమస్యేలేదు... అధికారులు, దళారుల పాత్రే కీలకం! దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

వివరాళ్లోకి వెళ్తే... పేదల పెళ్లిళ్ల కోసం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం "ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుక" పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వివాహం చేసుకున్న నిరుపేద కుటుంబాల యువతీ యువకులకు ఆర్థికసాయం కింద రూ.51,000 అందజేస్తోంది. ఈ సమయంలో ఈ పథకం పేరుచెప్పి ప్రభుత్వ సొమ్ము కాజేయాలని, అప్పనంగా మింగేయాలని కొందరు అధికారులు దళారులతో చేతులు కలిపారు.

ఇందులో భాగంగా జనవరి 25న బలియా జిల్లాలోని మనియర్‌ పట్టణ కాలేజీలో నిర్వహించిన ప్రభుత్వ సామూహిక పెళ్లిళ్ల కార్యక్రమానికి నకిలీ వధూవరులను తీసుకువచ్చారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వీరంతా ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎదురుగా పెళ్లికొడుకు లేకుండానే వందలాది యువతులు ఎవరి మెడలో వారే వరమాలలు వేసుకొని పెళ్లి చేసుకున్నారు.

అయితే ఈ విచిత్రమైన వివాహాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో... విషయం గ్రహించిన పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా 8 మంది అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు! ఈ సందర్భంగా ఈ వ్యవహారంపై స్పందించిన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రవీంద్ర కుమార్‌... ఇంకా ఎవరికీ నిధులను విడుదల చేయలేదని తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్లు వివరించారు.