ఆకతాయిల నుంచి తప్పించుకోవటానికి గూడ్స్ రైలెక్కేసిన ఇద్దరు అమ్మాయిలు
ట్యూషన్ నుంచి తిరిగి వస్తున్న వేళ ఆకతాయిలు వెంటపడే ఉదంతాల్ని చూస్తుంటాం
By: Tupaki Desk | 7 Aug 2024 5:17 AM GMTట్యూషన్ నుంచి తిరిగి వస్తున్న వేళ ఆకతాయిలు వెంటపడే ఉదంతాల్ని చూస్తుంటాం. తాజాగా అలాంటి పరిణామం చోటు చేసుకోగా బెదిరిపోయిన ఇద్దరు అమ్మాయిలు గూడ్స్ రైలెక్కి దాదాపు 140 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన షాకింగ్ ఉదంతం ఒకటి వెలుగు చూసింది. అర్థరాత్రి వేళలో ఇటావా రైల్వే స్టేషన్ లో భయం భయంగా కూర్చొని.. బిత్తరచూపులు చూస్తున్న ఇద్దరు అమ్మాయిల్ని ఆరా తీయగా షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.
ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్ కు చెందిన ఇద్దరు బాలికలు ట్యూషన్ నుంచి తిరిగి వస్తున్నారు. వారిని ఆకతాయిలు ఎదురుపడి వేధింపులకు గురి చేశారు. వారి వెంట పడ్డారు. దీంతో వారిని తప్పించుకోవటానికి పరుగులు తీసిన ఈ ఇద్దరుబాలికలు.. రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలు ఎక్కేసి.. దాక్కున్నారు. ఇంతలో రైలు కదిలిపోయింది. ఏం చేయాలో పాలుపోక అలానే అందులో ఉండిపోయారు.
గూడ్స్ రైలు 140కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఇటావా స్టేషన్ వద్ద ఆగింది. దీంతో.. గూడ్స్ రైలు నుంచి బయటకు వచ్చిన ఈ ఇద్దరు బాలికలు చీకట్లో స్టేషన్ లో కూర్చుండిపోయారు. భయం భయంగా ఉన్న వారిద్దరిని గమనించిన అక్కడి వారు ఆరా తీయగా.. అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు. దీంతో వారి చేతిలో ఉన్న సెల్ ఫోన్ తో వారి ఇంటి వారికి సమాచారం ఇచ్చారు. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న స్టేషన్ సూపరింటెండెంట్ స్పందించి.. బాలికల కుటుంబాలతో మాట్లాడి వారిని సేఫ్ గా ఇంటికి పంపే ఏర్పాట్లు చేయటంతో కథ కంచికి చేరింది.