అవును .. పేపర్స్ లీక్ నా ఘనతే !
‘‘నాకు చాలా రాష్ట్రాలలో సంబంధాలు ఉన్నాయి. చిన్న చిన్న కేసులు నేను తీసుకోను.
By: Tupaki Desk | 28 Jun 2024 5:28 AM GMT‘‘నాకు చాలా రాష్ట్రాలలో సంబంధాలు ఉన్నాయి. చిన్న చిన్న కేసులు నేను తీసుకోను. ఎక్కువ మంది ఉండే పెద్ద వ్యవహారాలు అయితేనే ఒప్పుకుంటా. నాకు డబ్బులు ఇస్తే కచ్చితంగా అభ్యర్థిని పాస్ చేయిస్తా. పరీక్ష రద్దు అయితే మాత్రం నాకు సంబంధం లేదు. డబ్బులు తీసుకుని అనేక రాష్ట్రాలలో ఎంతో మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా చేశాను’’ అని బీజేపీ మిత్రపక్షమైన సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బీఎస్‌పీ)కి చెందిన జఖానియా ఎమ్మెల్యే బేడీ రాం అలియాస్ త్రివేణి రాం మాట్లాడినప్పుడు రహస్యంగా రికార్డ్ చేసిన వీడియో దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది.
నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిన వివాదం దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తున్న నేపథ్యంలో ఈ వీడియో సంచలనంగా మారింది. బేడీ రాంకు డబ్బులిచ్చినా ఉద్యోగం రాకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒక యువకుడు అడుగుతున్న క్రమంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తుంది.
బేడీ రాం వ్యాఖ్యలపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ తీవ్రంగా స్పందించాయి. బేడీ రాంకు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయని, పేపర్ లీక్‌లో తన పాత్ర ఉందని ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా ఎన్డీయేలో ఎలా ఉన్నాడని ప్రశ్నిస్తున్నాయి. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న బీజేపీ మిత్రపక్ష నాయకుల నైతిక దిగజారుడుతనానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. వెంటనే బేడీ రాంను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే బేడీరాం ఎన్నికల అఫిడవిట్‌లో తొమ్మిది కేసులు నమోదై ఉండగా వీటిల్లో ఎనిమిది కేసులు పేపర్ లీక్ ఘటనలకు సంబంధించినవేనని తెలుస్తుండడం గమనార్హం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో రైల్వే, పోలీసు నియామక పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్ చేశాడని అతడిపై కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.