Begin typing your search above and press return to search.

శాస్వతంగా డిబార్ పూజా ఖేడ్కర్‌ పై యూపీఎస్సీ రెండు సంచలన నిర్ణయాలు!

ఈ సమయంలో విచారణ అనంతరం ఆమెపై యూపీఎస్సీ రెండు సంచలన నిర్ణయాలు తీసుకొంది!

By:  Tupaki Desk   |   31 July 2024 5:09 PM GMT
శాస్వతంగా డిబార్ పూజా ఖేడ్కర్‌  పై యూపీఎస్సీ రెండు సంచలన నిర్ణయాలు!
X

పూణెలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్ పై సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అటు అధికార దుర్వినియోగంతోపాటు, యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలూ వచ్చాయి. ఈ సమయంలో విచారణ అనంతరం ఆమెపై యూపీఎస్సీ రెండు సంచలన నిర్ణయాలు తీసుకొంది!

అవును... గత కొంత కాలంగా ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పూజా ఖేడ్కర్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈమె వ్యవహారంపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ) దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే తనపై వస్తోన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

అయినప్పటికీ ఆమె నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో... యూపీఎస్సీ చర్యలకు ఉపక్రమించింది. ఈ సందర్భంగా రెండు సంచలన నిర్ణయాలు తీసుకొంది. ఇందులో భాగంగా... పూజా ఖేడ్కర్ ప్రొవిజినల్ అభ్యర్థిత్వాన్ని రద్ధు చేసింది. ఇదే సమయంలో... భవిష్యత్తులో మళ్లీ నియామక పరీక్షలు రాసే అవకాశం లేకుండా ఏకంగా డిబార్ చేసింది. ఈ మేరకు అధికారులు బుధవారం ఈ విషయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసిన యూపీఎస్సీ... తనపై వస్తోన్న ఆరోపణలపై జూలై 25లోగా వివరణ ఇవ్వాలని పూజా ఖేడ్కర్ ను ఆదేశించినట్లు తెలిపింది. అయితే... ఆమె ఆగస్టు 4వరకూ గడువు కావాలని కోరిందని తెలిపింది. అయితే... ఆమె కోరిన గడువును తిరస్కరించిన యూపీఎస్సీ.. ముందుగా ఇచ్చిన గడువును పొడిగించి జూలై 30 వరకూ అదనపు సమయం కల్పించినట్లు వెల్లడించింది.

ఇదే సమయంలో జూలై 30 మాత్రమే చివరి అవకాశమని, అనంతరం ఎలాంటి పొడిగింపులూ ఉండవని స్పష్టం చేసినట్లు యూపీఎస్సీ తెలిపింది. అయితే.. ఆమెకు పొడిగించిన గడువులోగా కూడా వివరణ ఇవ్వలేదని, సమాధానం సమర్పించలేదని.. అందువల్ల సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ - 2022లో ఆమె ప్రొవిజినల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతోపాటు.. భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే ఏ పరీక్షలకూ హాజరుకాకుండా శాస్వతంగా డిబార్ చేసినట్లు వెల్లడించింది.

మరోవైపు... చీటింగ్, ఫోర్జరీ ఆరోపణలపై ఇప్పటికే ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో... ఆమె ముందస్తు బెయిల్ కోసం ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై గురువారం (ఆగస్టు 1)న న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. దీంతో... ఎలాంటి తీర్పు రాబోతుందనేది ఆసక్తిగా మారింది.