Begin typing your search above and press return to search.

అఖిలేష్ కి ప్రధాని పీఠం మీద ఆశలు ?

అయితే ఇందులో వాజ్ పేయి నరేంద్ర మోడీ యూపీ కోటాలో నుంచే గెలిచి ప్రధానులు అయ్యారు.

By:  Tupaki Desk   |   26 July 2024 3:43 AM GMT
అఖిలేష్ కి ప్రధాని పీఠం మీద ఆశలు ?
X

ఉత్తరప్రదేశ్ అంటే ప్రధానులను దేశానికి అందించిన రాష్ట్రం అని పేరు. ఈ రోజున దేశంలో అనేక మంది ప్రధానులు పాలించారు అంటే వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వారే కావడం విశేషం. తొలి ప్రధాని పండిట్ నెహ్రూ ఆ తరువాత లాల్ బహుదూర్ శాస్త్రి, శ్రీమతి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వీపీ సింగ్, చరణ్ సింగ్, చంద్రశేఖర్ వంటి వారు అంతా యూపీ నుంచి వచ్చిన వారే.

ఇక వాజ్ పేయి మధ్యప్రదేశ్ కి చెందిన వారు. మొరార్జీ దేశాయ్ నరేంద్ర మోడీ గుజరాత్ కి చెందిన వారు, మన్మోహన్ సింగ్ అసోం కి చెందిన వారు, పీవీ నరసింహారావు ఉమ్మడి ఏపీకి చెందిన వారుగా ఉంటే దేవేగౌడ కర్నాటకకు చెందిన వారు. అయితే ఇందులో వాజ్ పేయి నరేంద్ర మోడీ యూపీ కోటాలో నుంచే గెలిచి ప్రధానులు అయ్యారు. అలా టెక్నికల్ గా యూపీ వారిని ప్రధానులు చేసింది అని చెప్పుకోవాలి.

ఇలా మొత్తం లిస్ట్ చూస్తే యూపీయే దేశానికి ప్రధానులను అందిస్తుంది అని అంతా అంగీకరించాల్సిందే. మొత్తం 543 మంది ఎంపీలు ఉంటే అందులో 80 మంది ఎంపీలు అంటే 15వ శాతం ఎంపీలను యూపీయే అందిస్తొంది. అలా దేశానికి గుండె కాయ లాంటి రాష్ట్రంగా యూపీ ఉంది.

గత రెండు సార్లూ యూపీలో అత్యధిక సీట్లు సాధించినందుకే బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. 2024 లో మాత్రం బీజేపీకి 33 వస్తే సమాజ్ వాదీ పార్టీకి 37 ఎంపీలు వచ్చాయి. దాంతో యూపీ మీద ఎస్పీ పట్టు పెరిగింది. రానున్న కాలంలో మరింతగా బీజేపీ దెబ్బ తింటుందని తమ బలం పెరుగుతుందై ఎస్పీ ఊహిస్తోంది.

ఇక ఎప్సీ అధినేత యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కి ప్రధాని పదవి మీద మోజు ఉందని కూడా అంటున్నారు. దాంతోనే ఆయన జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నారని అంటున్నారు. ఆయన ప్రస్తుతం 2026లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టారని అంటున్నారు. రెండు సార్లు వరసగా బీజేపీ గెలిచింది. యోగీ ఆదిత్యనాధ్ సీఎం గా ఉన్నారు.

అటు మోడీ ఇటు యోగీ పొలిటికల్ గ్లామర్ తగ్గిందని ఎప్సీ భావిస్తోంది. దాంతో 2026లో యూపీ గద్దె మీద ఎస్పీ కూర్చుంటుందని భావిస్తోంది. అలా యూపీ సీఎం గా మరోసారి అఖిలేష్ యాదవ్ ప్రమాణం చేస్తారని అంటున్నారు. ఇక 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికల దాకా యూపీ సీఎం గా పనిచేస్తూ అప్పటికి జాతీయంగా ప్రధాని పీఠం మీద గురి పెట్టాలని ఆయన చూస్తున్నారని అంటున్నారు.

దానికి అఖిలేష్ లెక్కలు పక్కాగా ఉన్నాయని అంటున్నారు. యూపీని ఎస్పీ కైవసం చేసుకుంటే 2029 నాటికి ఎంపీల సంఖ్య కచ్చితంగా 60 పైగా గెలుచుకోవచ్చు అని భావిస్తున్నారు. అది కాంగ్రెస్ తరువాత అతి పెద్ద నంబర్ గా ఉండబోతోంది. దాంతో పాటు ఇతర పార్టీల మద్దతు తీసుకుని ఇండియా కూటమి దన్నుతో కేంద్రంలో ప్రధాని కావాలని చూస్తున్నారు అని అంటున్నారు.

అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ కూడా ప్రధాని పదవి కోసం కలలు కన్నారు. కానీ రక్షణ మంత్రిగా పనిచేసి అక్కడే ఆగిపోయారు. ఆ కలను అఖిలేష్ యాదవ్ తీర్చుకోవాలని అనుకుంటున్నారని అంటునారు. ఆయన ఇండియా కూటమి మద్దతు పార్టీలతో తరచూ భేటీ అవుతున్నారు. ఇటీవల పశ్చిన బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీకి మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు.

తాజాగా వైఎస్ జగన్ ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో సైతం అఖిలేష్ పాల్గొనడమే కాకుండా జగన్ కి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. జగన్ కి అఖిలేష్ కి మంచి స్నేహ బంధం ఉంది. దాంతో ఆయనను ఇండియా కూటమి వైపు తీసుకుని రావాలని చూస్తున్నారు. ఇండియా కూటమిలో పార్టీల మద్దతు కూడగడితే తనకు ప్రధాని పీఠం ఎక్కే చాన్స్ వస్తుందని అఖిలేష్ ఆలోచిస్తున్నారని అంటున్నారు.

బీహార్ లో లాలూ యాదవ్ పార్టీతో సామాజిక బంధంతో పాటు బంధుత్వం కూడా ఉంది. ఇలా అఖిలేష్ యాదవ్ ఆలోచనలో భాగమే జగన్ ధర్నాకు హాజరు కావడం అని కూడా ప్రచారం సాగుతోంది. జగన్ సైతం ఇండియా కూటమిలో కాంగ్రెస్ కాకుండా ఎవరు ప్రధాని అయినా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు అని కూడా అంటున్నారు. సో ఏది ఏమైనా అఖిలేష్ జగన్ భేటీ తరువాత రకరకాలైన ప్రచారాలు సాగుతున్నాయి. ఇందులో నిజాలు ఏమిటి అన్నది కాలం జవాబు చెప్పాలి.