Begin typing your search above and press return to search.

వివాహ విందులో వెయిట‌ర్‌ను చంపేశారు.. రీజ‌న్ తెలిస్తే షాకవుతారు!

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఉన్న‌ సీసీఎస్‌ వాటికా గెస్ట్‌ హౌస్‌లో ఇటీవ‌ల ఓ పెళ్లి జరిగింది. దీనిలో భారీ ఎత్తున విందు ఇచ్చారు

By:  Tupaki Desk   |   8 Dec 2023 3:42 AM GMT
వివాహ విందులో వెయిట‌ర్‌ను చంపేశారు.. రీజ‌న్ తెలిస్తే షాకవుతారు!
X

వెయిట‌ర్‌. హోట‌ళ్ల‌లో అయినా.. ఇండివిడ్యువ‌ల్‌గా ఇచ్చే విందుల్లో అయినా.. అతిథి మ‌ర్యాదుల చేస్తూ.. కావాల్సిన వారికి ఆహార ప‌దార్థాలు అడ‌కుండానే వ‌డ్డించి.. త‌న ఆక‌లిని సైతం మ‌రిచిపోయే చిరు ఉద్యోగి. అయితే.. వీరు ప‌నిస‌మ‌యాల్లో కొన్ని కొన్ని సార్లు.. చిన్న చిన్న త‌ప్పులు దొర్లుతుంటాయి. తీసుకువ‌స్తున్న ప‌దార్థాలు ఒలికి పోవ‌డం లేదా.. తినేసిన త‌ర్వాత ప్లేట్లు తీసుకువెళ్లేస‌మ‌యంలో అవి అటు ఇటు జ‌రిగి కింద ప‌డ‌డం.. ఇలా ఏవో చిన్న చిన్న పొర‌పాట్లు జ‌రిగి.. గెస్టుల‌కు ఇబ్బంది అవుతుంది.

అయితే..అవేవీ ఉద్దేశ పూర్వ‌కంగా వెయిట‌ర్లు చేసేవి కావు. దీంతో వాటిని పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. పైగా వెయిట‌ర్ త‌మకు మంచి ఆతిథ్యం ఇచ్చాడ‌ని.. సంతోషంతో టిప్పు కూడా ఇస్తుంటారు. కానీ, ఒక వివాహ వేడుక‌లో దొర్లిన చిన్న పొర‌పాటును మ‌న‌సులో పెట్టుకుని ఏకంగా వెయిట‌ర్ ఉసురు తీసిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. నిజానికి అత‌నేమీ ఉద్దేశ పూర్వ‌కంగా ఆ ప‌నిచేయ‌క‌పోయినా .. త‌మ అతిథులు.. ఇబ్బంది ప‌డ్డార‌నే నెపంతో క్ష‌ణికావేశానికి గురై.. వెయిట‌ర్‌ను చంపేశారు.

ఏం జ‌రిగింది?

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఉన్న‌ సీసీఎస్‌ వాటికా గెస్ట్‌ హౌస్‌లో ఇటీవ‌ల ఓ పెళ్లి జరిగింది. దీనిలో భారీ ఎత్తున విందు ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మానికి వెయిట‌ర్‌గా పంక‌జ్ అనే వ్య‌క్తి వ‌చ్చాడు. అతను అతిథులు భోజనం చేసిన తర్వాత పాత్రలను ఒక ట్రేలో వేసుకుని తీసుకువెళుతుండ‌గా.. ఈ క్రమంలో పొరపాటున అడ్డుగా ఉన్న అతిథులకు ట్రే తగిలింది. దీంతో వారు ఆగ్ర‌హోద‌గ్రుల‌య్యారు.

అది కాస్తా గొడవకు దారి తీయడంతో పంకజ్‌ను కాంట్రాక్టర్‌ మనోజ్‌ సహా మరికొందరు తీవ్రంగా చితకబా దారు. ఆ దెబ్బలకు తాళలేక పంకజ్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు నిందితులు మృతదేహాన్ని సమీపంలో ఉన్న అడవిలో పడేశారు. పనికి వెళ్లిన కుమారుడు ఇంటికి రాకపోవడంతో అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘ‌ట‌న రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించ‌డంతో .. వెయిట‌ర్ల సంఘం ఆందోళ‌న‌కు దిగింది.