ట్రంప్ ప్రచారాస్త్రాల్లో ఒకటి.. రెండు భారతీయ కంపెనీలకు షాకింగ్ న్యూస్!
ఈ ఫెంటనిల్ పై ఎన్నికల సమయంలో ట్రంప్ చాలా సీరియస్ గా స్పందించారు కూడా.
By: Tupaki Desk | 7 Jan 2025 9:30 AM GMTరెండు భారతీయ కంపెనీలపై అమెరికాలో సంచలన అభియోగాలు నమోదయ్యాయి. ఇందులో భాగంగా... ఫెంటనిల్ రసాయనాన్ని దిగుమతి, పంపిణీ చేసినట్లుగా ఆ రెండు కంపెనీలపైనా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో... ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఫెంటనిల్ పై ఎన్నికల సమయంలో ట్రంప్ చాలా సీరియస్ గా స్పందించారు కూడా.
అవును... అత్యంత ప్రమాదకరమైన ఫెంటనిల్ రసాయనాన్ని గుజరాత్ కు చెందిన రక్సూటర్, అథోస్ అనే రెండు కెమికల్ కంపెనీలు అమెరికా, మెక్సికోలకు సరఫరా చేస్తున్నాయనీ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించింది. ఈ తరహా సంచలన ఆరోపణలు భారతీయ కంపెనీలపై నమోదుకావడం ఇదే తొలిసారని అంటున్నారు.
ఈ సంచలన కేసులో రక్సూటర్ కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ భవేశ్ లథియాను ఈ నెల 4న అరెస్ట్ చేశారు. ఈ సమయంలో.. అతడిపై మోపబడిన అభియోగాలు నిరూపణైతే అతడికి సుమారు 53 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో... ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.
కాగా... గత ఏడాది అగ్రరాజ్యంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రధాన ప్రచార అస్త్రాల్లో ఈ ఫెంటనిల్ కూడా ఒకటి. ఆయన ప్రధానంగా ప్రస్థావించిన అక్రమ వలసలు, డ్రగ్స్ తో పాటు ఫెంటనిల్ గురించి ప్రస్థావిస్తూ డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించేవారు.
దీనిపై స్పందించిన నిపుణులు ఫెంటనిల్ గురించి షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. ఈ ఫెంటనిల్ అనేది కేంద్ర నాడీవ్యవస్థపై పనిచేసే పెయిన్ కిల్లర్ అని.. ఇది హెరాయిన్ కంటే 50 రెట్లు శక్తివంతమైనదని చెబుతున్నారు. ఈ ఫెంటనిల్ రెండు మిల్లీ గ్రాముల డోస్ కూడా ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు.
వాస్తవానికి ఒకప్పుడు పెయిన్ కిల్లర్ గా వినియోగించే ఈ ఫెంటనిల్ ని ఆస్పత్రుల బయట వినియోగించేవారు కాదు. అయితే... ఇప్పుడు మాత్రం ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా వాడుతున్నారని అంటున్నారు. ప్రధానంగా మెక్సికోలోని క్రిమినల్ గ్యాంగ్ ల చేతుల్లో ఇది పడటమే దీనికి కారణం అని చెబుతున్నారు.
ఇదే సమయంలో... చైనాలో వీటిని తక్కువ ధరకు తయారుచేసి అమెరికాకు వివిధ మార్గాల ద్వారా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గుజరాత్ కు చెందిన రెండు కంపెనీలు అమెరికా, మెక్సికోలకు ఈ అత్యంత ప్రమాదకరమైన రసాయనాన్ని సరఫరా చేస్తున్నాయని అభియోగాలు నమోదయ్యాయి.