వీసా అపాయింట్ మెంట్స్ రద్దు : భారత్ లో ‘బాట్స్’ మోసం గుర్తించిన అమెరికా
భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 2,000 వీసా అపాయింట్‌మెంట్‌లను రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.
By: Tupaki Desk | 27 March 2025 1:14 PMభారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 2,000 వీసా అపాయింట్‌మెంట్‌లను రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. దీనికి గల కారణాన్ని కూడా వెల్లడించింది. మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతోనే ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. తమ అపాయింట్‌మెంట్ వ్యవస్థలో భారీ లోపాన్ని గుర్తించామని, ఈ అపాయింట్‌మెంట్లన్నీ ‘బాట్స్’ ద్వారా వచ్చాయని దౌత్య కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ (X) వేదికగా ఓ పోస్ట్ కూడా పెట్టింది.
"భారత్‌లోని కాన్సులర్ బృందం బాట్స్ ద్వారా బుక్ అయిన 2,000 వీసా అపాయింట్‌మెంట్‌లను రద్దు చేస్తోంది. మా షెడ్యూలింగ్ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్లు, ఫిక్సర్లను మేము ఎంతమాత్రం సహించం. ఈ అపాయింట్‌మెంట్‌లను రద్దు చేయడంతో పాటు, సంబంధిత ఖాతాలకు షెడ్యూలింగ్ అధికారాలను కూడా నిలిపివేస్తున్నాం. మోసాలను నిర్మూలించడానికి మా ప్రయత్నాలు కొనసాగుతాయి. వాటిని ఏ మాత్రం ఉపేక్షించం" అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
అమెరికా బిజినెస్, విజిటర్స్ (B1/B2), స్టూడెంట్ వీసాల కోసం అపాయింట్‌మెంట్లు పొందడానికి చాలా కాలం వేచి ఉండాల్సి వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, కొంతమంది ఏజెంట్లకు డబ్బులు చెల్లిస్తే మాత్రం నెల రోజుల్లోనే అపాయింట్‌మెంట్లు లభిస్తున్నాయనేది బహిరంగ రహస్యం. పర్యటక రంగంలో ఇది సర్వసాధారణంగా మారిపోయింది. ఇందుకోసం ఒక్కో వీసా దరఖాస్తుదారుడి నుంచి ఏజెంట్లు రూ.30,000 నుంచి రూ.35,000 వరకు వసూలు చేస్తున్నారు. ఒక వ్యక్తి తన కుమారుడు అమెరికాలోని విశ్వవిద్యాలయంలో చేరడానికి స్వయంగా వీసా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించగా అది సాధ్యం కాలేదని, అదే ఏజెంట్‌కు రూ.30 వేలు చెల్లిస్తే వెంటనే వచ్చిందని ఓ ఆంగ్ల వార్తాపత్రికకు తెలిపారు.
సాధారణంగా వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు సొంతంగా ప్రయత్నిస్తే సమీప భవిష్యత్తులో అపాయింట్‌మెంట్ తేదీలు అందుబాటులో ఉండవు. కానీ ఏజెంట్లు మాత్రం ప్రత్యేకమైన బాట్స్‌ను ఉపయోగించి స్లాట్‌లను బ్లాక్ చేస్తున్నారు. 2023లో B1/B2 అపాయింట్‌మెంట్ల వెయిటింగ్ సమయం ఏకంగా 999 రోజులకు చేరుకుంది. దీంతో భారతీయ దరఖాస్తుదారుల కోసం ఫ్రాంక్‌ఫర్ట్, బ్యాంకాక్ వంటి ఇతర ప్రదేశాల్లో అమెరికా అపాయింట్‌మెంట్లను తెరవాల్సి వచ్చింది.
దాదాపు మూడేళ్ల క్రితం వీసా వెయిటింగ్ సమయం ఎక్కువగా ఉన్న విషయాన్ని భారత ప్రభుత్వం అమెరికా దృష్టికి తీసుకెళ్లింది. దీనిని తీవ్రంగా పరిగణించిన అమెరికా ప్రభుత్వం వెయిటింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించింది. తాజాగా ఇప్పుడు బాట్స్ వినియోగాన్ని అడ్డుకోవడంపై దృష్టి సారించింది. ఈ చర్యల ద్వారా వీసా అపాయింట్‌మెంట్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, నిజాయితీగా ఉంచడానికి అమెరికా ప్రయత్నిస్తోంది.