'కాసు'కో చైనా.. ఏ యుద్ధానికైనా మేం సిద్ధం: అమెరికా
డ్రాగన్ తో ఎలాంటి పోరాటానికైనా తమ దేశం సిద్ధంగా ఉందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ అన్నారు.
By: Tupaki Desk | 6 March 2025 5:20 PM ISTప్రపంచంలో ప్రస్తుతం నంబర్ వన్, నంబర్ టు ఆర్థిక వ్యవస్థలు అమెరికా, చైనా. అలాంటి దేశాల మధ్య ట్రంప్ సుంకాలను ప్రకటించిన తర్వాత ఉద్రిక్తత ప్రారంభమైంది. వీటి మధ్య ట్రేడ్ వార్ అంటే అది సంచలనమే. దీనికితగ్గట్లే ‘మాతో పెట్టుకుంటే ఎంతకైనా వెళ్తాం’ అంటూ బెదిరించిన చైనాపై అమెరికా కూడా దీటుగా స్పందించింది. డ్రాగన్ తో ఎలాంటి పోరాటానికైనా తమ దేశం సిద్ధంగా ఉందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ అన్నారు. ‘‘చివరివరకు ఎలాంటి యుద్ధం చేసినా పోరాడతాం’’ అని చైనా చేసిన ప్రకటన తర్వాత ఆయన స్పందించారు.
ప్రపంచంలోని రెండు అతిపెద్ద శక్తుల మధ్య ఉద్రిక్తతలు రాబోయే రోజుల్లో వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమయ్యే ప్రమాదం కల్పిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం చక్కెర దిగుమతులపై సుంకాన్ని రెట్టింపు చేసి 20 శాతానికి పెంచింది. ప్రతీకారంగా అమెరికా ఉత్పత్తులపై చైనా 10 నుంచి 15 శాతం సుంకాలను విధించింది. 25 అమెరికన్ కంపెనీలను నిషేధించింది.
అసలు చైనా-అమెరికా మధ్య జగడాని కారణం ఫెంటానిల్. ఈ డ్రగ్ అక్రమ రవాణాను చూపుతూ ట్రంప్ చైనాపై విరుచుకుపడుతున్నారు. టారిఫ్ లు బాదేశారు. దీంతో సమస్యను పరిష్కరించాలని కోరుకుంటే సమాన స్థాయిలో చర్చలు జరపాలని, అమెరికా యుద్ధం కోరుకుంటే అది టారిఫ్ వార్ అయినా, ట్రేడ్ వార్ అయినా, లేదా మరే ఇతర యుద్ధమైనా తాము తుది వరకు పోరాడేందుకు సిద్ధం" అని చైనా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
ఇది అమెరికా రక్షణ మంత్రి పరిశీలనకు వెళ్లగా ఆయన దీటుగా స్పందించారు. చైనాతో యుద్ధానికి అమెరికా సిద్ధంగా ఉందని హెగ్సేత్ అన్నారు. సంఘర్షణను నివారించడానికి సైనిక బలం కీలకమని.. అందుకే తమ సైన్యాన్ని పునర్నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. చైనాతో లేదా ఎవరితోనైనా యుద్ధం నిరోధించాలనుకుంటే మనం బలంగా ఉండాలన్నారు.