Begin typing your search above and press return to search.

వామ్మో.. 104 మంది భారతీయుల కోసం ట్రంప్ ఎంత ఖర్చు చేశారో తెలుసా?

ఈ క్రమంలో... వారందరి కోసం అగ్రరాజ్యం అమెరికా వెచ్చించిన ఖర్చు భారీగా ఉండటం గమనార్హం.

By:  Tupaki Desk   |   7 Feb 2025 2:30 PM GMT
వామ్మో.. 104 మంది భారతీయుల కోసం ట్రంప్  ఎంత ఖర్చు చేశారో తెలుసా?
X

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాగానే తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. చాలా దేశాలతో పాటు ఇటీవల భారతీయులను స్వదేశానికి తరలించేశారు. ఈ క్రమంలో... వారందరి కోసం అగ్రరాజ్యం అమెరికా వెచ్చించిన ఖర్చు భారీగా ఉండటం గమనార్హం.

అవును... డొనాల్డ్ ట్రంప్ ఇటీవల 104 మంది భారతీయులను వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ-17ఏ గ్లోబ్ మాస్టర్ 3 విమానం గత బుధవారం వలసదారులను తీసుకొని అమృత్ సర్ ఎయిర్ పోర్ట్ లో దిగింది. ఈ సమయంలో అమెరికా 1 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.

అంటే... భారత కరెన్సీలో సుమారు రూ.8.74 కోట్లన్నమాట. 104 మందిని అమెరికా నుంచి భారత్ కు పంపాలంటే అంత ఖర్చవుతుందా.. అని అంటే.. దానికి కారణం రెగ్యులర్ పౌర విమానాలతో పోలిస్తే సైనిక విమానాల మెయింట్నెన్స్ ఖర్చు మూడు రెట్లు ఎక్కువగా ఉండటమేనని చెబుతున్నారు. అందుకే ఇంత ఖర్చని కథనాలొస్తున్నాయి.

కాగా.. గతంలో అక్రమ వలసదారుల తరలింపునకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) విభాగం కమర్షియల్ ఛార్టర్ ఫ్లైట్స్ ని ఉపయోగించిందే. ఈ క్రమంలో 2021 లెక్కల ప్రకారం.. ఆ విమానాల ఖర్చు గంటకు 8,755 డాలరు గా ఉండేది. అంటే.. సుమారు ఏడున్నర లక్షల రుపాయలన్నమాట.

అయితే.. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమ వలసదారుల తరలింపు కోసం తొలిసారిగా సైనిక విమానాలను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో సీ-17 మిలటరీ విమానం రవాణా ఖర్చు గంటకు 28,652 డాలర్లుగా చెబుతున్నారు. అంటే... సుమారు రూ.25 లక్షలు.

వాస్తవానికి అమెరికా నుంచి అమృత్ సర్ రావడానికి ఈ మిలటరీ విమానానికి సుమారు 43 గంటల సమయం పట్టిందని చెబుతున్నారు. ఈ లెక్కన తిరుగు ప్రయాణాన్ని కూడా కలుపుకుంటే.. వలసదారులను భారత్ కు తరలించడానికి మొత్తంగా ఒక మిలియన్ డాలర్ పైనే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. అంటే.. ఒక్కో వలసదారుడిపైనా రూ.8.74 లక్షలుపైనే అమెరికా ఖర్చు చేసిందన్నమాట.