Begin typing your search above and press return to search.

భారత ఆర్థిక వ్యవస్థపై యూఎస్ ఎన్నికల ప్రభావం.. ఓ అవలోకనం!

మరికొన్ని రోజుల్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాలు హోరెత్తిపోతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Oct 2024 11:30 PM GMT
భారత ఆర్థిక వ్యవస్థపై యూఎస్ ఎన్నికల ప్రభావం.. ఓ అవలోకనం!
X

మరికొన్ని రోజుల్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాలు హోరెత్తిపోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానంగా ఇమ్మిగ్రేషన్, అక్రమవలసలు, దౌత్యపరమైన సంబంధాలు, స్థానికులకు ఉద్యోగాలు మొదలైన అంశాలపై హామీలు కీలకంగా మారాయని అంటున్నారు. అంతకంటే ముఖ్యంగా దేశ ఆర్థిక విధానాలపై విజన్ కీలక భూమిక పోషించబోతోందని అంటున్నారు.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే కేవలం ఆ దేశానికి సంబంధించినవే కాదు. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజానికం అమెరికాలో ఉంటారు. అందులో కొంతమంది ప్రవాసులుగా ఉండగా.. మరికొంతమంది పౌరసత్వం దక్కిన విదేశీ సంతతివారు ఉంటారు. ఇక భారత దేశం సంగతి చెప్పేపనిలేదు. అగ్రరాజ్యంలో దాదాపు అన్ని రంగాల్లోనూ ప్రవాస భారతీయులు, భారతీయ అమెరికన్ల పాత్ర కీలకంగా ఉంది.

ఇదే సమయంలో అమెరికాతో భారత్ కు వాణిజ్యం పరంగా చాలా పెద్ద బంధమే ఉంది. ఈ నేపథ్యంలో అపారమైన అధికారాన్ని కలిగి ఉండే అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం చూపుతాయి. దీంతో... త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరి గెలుపు భారత్ పై ఎలాంటి ప్రభావం చూపబోతోందనేది ఆసక్తిగా మారింది.

అమెరికా అధ్యక్ష ఎనికల ఫలితాలు అమెరికా ఆర్థిక విధానాలను ఎలాగూ మారుస్తాయి! ఇదే సమయంలో... భారతీయ ఎగుమతులు, పెట్టుబడులను నేరుగా ప్రభవితం చేస్తాయని చెబుతున్నారు. ఇక ఎన్నికల ఫలితాలు భారతీయ స్టాక్ మార్కెట్ పైనా తక్షణ ప్రభావం చూపుతాయని.. దాని ప్రభావం కొన్ని నెలల పాటు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హారిస్, ట్రంప్ లో ఎవరు మెరుగనే చర్చ తెరపైకి వచ్చింది.

ఈ సందర్భంగా... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడనుందనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి భారత ప్రధాని మోడీతో ట్రంప్ కు మంచి స్నేహమే ఉంది. అయినప్పటికీ... భారత్ ను "సుంకాల రాజు" గా అభివర్ణిస్తున్నారు ట్రంప్. ఇదే సమయంలో... తాను అధ్యక్ష ఎనికల్లో గెలిస్తే... భారత్ నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకాల భారం పెంచుతామని ప్రకటించారు.

ఇదే సమయంలో... ట్రంప్ హయాంలో కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు ఉంటాయని.. అవి భారతీయ సమాజానికి ఉద్యోగ అవకాశాలను పరిమితం చేస్తాయని అంటున్నారు. "అమెరికా ఫస్ట్" అనే విధానంతో ట్రంప్ ముందుకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నందున.. ఇది భారత సమాజానికి కాస్త క్లిష్టపరిస్థితులను సృష్టించినా ఆశ్చర్యపోనక్కరలేదని చెబుతున్నారు.

ఇక కమలా హారిస్ విషయానికొస్తే... ఈమె హయాంలో మెరుగైన వాణిజ్య సంబంధాలకు దారితీసే బలమైన దౌత్య బంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించొచ్చని చెబుతున్నారు.

ఏది ఏమైనా... ఎవరు అగ్రరాజ్యం అధ్యక్షుడైనా... అమెరికా నుంచి భారత్ ఎదుర్కొనే సవాళ్లు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, దక్కే ప్రయోజనాలు దక్కుతుంటాయని అంటున్నారు పైశీలకులు. కాకపోతే వ్యూహాత్మకంగా ముందుకు కదలడమే అని అంటున్నారు. కాగా.. అటు రిపబ్లికన్స్ తోనూ, ఇటు డెమోక్రాట్ల తోనూ భారత భారత మూలాలున్న వ్యక్తులు కీలకంగా ఉండటం శుభసూచకమని చెబుతున్నారు.