అమెరికా నుంచి లేడీ డాక్టర్ బహిష్కరణ... వైరల్ గా బైబై రాషా!
కిడ్నీ మార్పిడి స్పెషలిస్టుగా పనిచేస్తున్న లెబనీస్ మహిళా డాక్టర్ కు.. హెజ్ బొల్లాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ.. అమెరికా తమ దేశం నుంచి బహిష్కరించింది.
By: Tupaki Desk | 18 March 2025 4:00 PM ISTఅమెరికా తమ దేశం నుంచి ఓ మహిళా డాక్టర్ ను బహిష్కరించింది. ఇందులో భాగంగా... రోడ్ ఐలాండ్ లో కిడ్నీ మార్పిడి స్పెషలిస్టుగా పనిచేస్తున్న లెబనీస్ డాక్టర్ రాషా అలవీని దేశం నుంచి బహిష్కరించింది. హెజ్ బొల్లాతో ఈమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అమెరికా ఈ నిర్ణయం ప్రకటించింది. ఈ సందర్భంగా వైట్ హౌస్ పోస్ట్ వైరల్ గా మారింది.
అవును... కిడ్నీ మార్పిడి స్పెషలిస్టుగా పనిచేస్తున్న లెబనీస్ మహిళా డాక్టర్ కు.. హెజ్ బొల్లాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ.. అమెరికా తమ దేశం నుంచి బహిష్కరించింది. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ ఓ పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా... డొనాల్డ్ ట్రంప్ ఆమెకు బై చెబుతున్నట్లుగా ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. “బైబై రాషా” అంటూ రాసుకొచ్చింది.
వాస్తవానికి లెబనాన్ పర్యటనకు వెళ్లిన రాషా ఫిబ్రవరి 23న జరిగిన హెజ్ బొల్లా మాజీ అధినేత హసన్ నస్రల్లా (64) అంత్యక్రియలకు హాజరైనట్లు చెబుతున్నారు. దీంతో.. గతవారం బోస్టన్ లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న ఆమెను అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నస్రల్లా అంత్యక్రియలు హాజరైనట్లు ఆమె అంగీకరించినట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో.. ఆమె ఫోన్ లో నస్రల్లాతో పాటు ఇతర హెజ్ బొల్లా నేతల ఫోటోలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే.. ఆమె లెబనాన్ నుంచి బోస్టన్ చేరుకునే ముందు వాటిని డిలీట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంపై అధికారులు ఆమెను ప్రశ్నించగా.. ఆమె అంగీకరించిందని అంటున్నారు.
విచారణలో భాగంగా ఈ విషయాలపై ఆమెను ప్రశ్నించగా.. వారి రాజకీయ కార్యకలాపాల గురించి కాకుండా మతపరమైన, ఆధ్యాత్మిక బోధనల విషయంలో మాత్రమే తాను హెజ్ బొల్లా నేతలను ఫాలో అవుతున్నట్లు ఆమె పేర్కొన్నారని చెబుతున్నారు. అయితే... హెజ్ బొల్లాతో సంబంధాలు ఉన్నాయని తెలియడంతో ఆమెను దేశం నుంచి బహిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా... 34ఏళ్ల రాషా బ్రౌన్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ గా పనిచేయడానికి హెచ్-1బీ వీసా ద్వారా అమెరికాకు వెళ్లారు. అయితే.. ఆమెను హెజ్ బొల్లా మద్దతుదారుగా గుర్తించినట్లు చెబుతోన్న అమెరికా అధికారులు.. ఆమెను దేశం నుంచి వెంటనే బహిష్కరించడానికి చర్యలు చేపట్టారు. అయితే.. దీన్ని ఆమె తరుపు న్యాయవాదులు వ్యతిరేకిస్తూ.. న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.