వీడియో: 80 ఏళ్ల నుంచి వచ్చి వెళ్తున్నారు... ఏలియన్స్ పై సంచలన విషయాలు!
చాలాకాలంగా గ్రహాంతరవాసులకు సంబంధించిన విషయాలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 March 2025 9:00 PM ISTచాలాకాలంగా గ్రహాంతరవాసులకు సంబంధించిన విషయాలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా 2009 డిసెంబర్ లో ‘అవతార్’ సినిమా విడుదలైనప్పటి నుంచీ దీనికి సంబంధించిన చర్చ మరింత విపరీతంగా సాగుతోంది! ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతుంటే.. చాలా మంది ఈ విషయాలను కొట్టిపారేస్తుంటారు.
ఈ భూమిపై మాత్రమే జీవం ఉందని నొక్కి చెబుతుంటారు. ఇటీవల అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఏలియన్స్ గురించి మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. గ్రహాంతరవాసులు భూమిపైనే మనుష్యుల మధ్యే జీవించి ఉండోచ్చని.. రూపం మార్చుకుని మానవుల మధ్యే అవి రహస్యంగా జీవిస్తున్నాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.
ఈ సమయంలో... భూమిపై గ్రహాంతర జీవుల ఉనికిని నొక్కి చెప్పే.. గ్రహాంతరవాసుల కార్యకలాపాల గురించి సమాచారాన్ని దాచడానికి యూఎస్ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాన్ని ఆరోపించే ఒక కొత్త డాక్యుమెంటరీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. దీని ప్రకారం... గ్రహాంతరవాసులు ఉన్నారు.. ఆ విషయం అమెరికా ప్రభుత్వానికి తెలుసు అని!
అవును... భూమిపై గ్రహాంతర వాసుల ఉనికి ఉంది అంటూ అమెరికా నిఘా విభాగం అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. తమ అనుభవంలో చూసినవి కచ్చితంగా మనిషులైతే కాదని నొక్కి చెబుతున్నారు. తాజాగా విడుదలైన "ది ఏజ్ ఆఫ్ డిస్ క్లోజర్" డాక్యుమెంటరీలో విశ్వంలో మనతో పాటు మరో గ్రహంలోనూ జీవుల ఉనికి ఉందని వివరించారు.
దీనికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ లో పలువురు నిఘా అధికారులు, శాస్త్రవేత్తలు తమ తమ అనుభవాలను వెల్లడించారు. ఇతర గ్రహాలపై జీవులు ఉండటమే కాదు.. ఇతర గ్రహం నుంచి భూమిపైకి వచ్చే అంతరిక్ష నౌకలు కూడా ఉన్నాయని.. వాటి గురించి తమకు స్పష్టంగా తెలుసని వారు వెళ్లడించారు. ఈ మేరకు 34 మంది నిఘా, మిలటరీ అధికారులు ఈ విషయాలు తెలిపారు.
1940ల నుంచి ఏలియన్స్ అంతరిక్ష నౌక ద్వారా భూమిపైకి వచ్చి వెళ్తున్నారని.. మన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని అమెరికా నిఘా అధికారులు డాక్యుమెంటరీలో పాల్గొన్నారు. ప్రస్తుతం గ్రహాంతరవాసులు భూమిపైనే ఉంటున్నారని.. ఈ విషయం తెలిసికూడా అమెరికా ప్రభుత్వం గోప్యత పాటిస్తోందంటూ వారు విమర్శించడం గమనార్హం.