ఏందయ్యా ఇది... గ్రీన్ కార్డ్ వచ్చినా కూడా షాక్ తప్పదా?
కాగా... అమెరికా చట్టాల ప్రకారం గ్రీన్ కార్డు పొందిన వ్యక్తి నుంచి కొన్ని సందర్భాల్లో దాని తిరిగి తీసుకోవచ్చు.
By: Tupaki Desk | 15 March 2025 12:30 AM ISTఅమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ వలసదారులకు ఊహించని షాకులిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... హెచ్1బీ వీసాదారుల నుంచి మొదలు విద్యార్థి వీసాలపై ఉన్నవారిని వదల కుండా ట్రంప్ సర్కార్ ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో కీలక మార్పులు చేస్తోంది! ఇక అక్రమ వలసదారుల సంగతి చెప్పే పనే లేదు!
ఆ దేశం, ఈ దేశం అనే తారతమ్యాలేమీ లేకుండా అక్రమ వలసదారులు కనిపించిన వారిని కనిపించినట్లుగా ఎత్తి, సంకెళ్లు వేసి, విమానంలో కూర్చోబెట్టి వారి వారి స్వదేశాలకు పంపిస్తున్నారు. ఈ సమయంలో.. గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ అమెరికాలో నిరవధికంగా ఉండలేరనే వ్యాఖ్య వైస్ ప్రెసిడెంట్ నుంచి వచ్చింది.
అవును... తాజాగా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్... గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన వారికి అమెరికాలో ఎల్లకాలం ఉండిపోయే హక్కు లేదని.. ఇది వాక్ స్వేచ్ఛకు సంబంధించిన అంశం కానే కాదని.. ఇది పూర్తిగా జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని అన్నారు.
ఇదే సమయంలో... అమెరికా పౌరులుగా ఎవరిని తమలో విలీనం చేసుకోవాలో, ఎవరిని వదులుకోవాలో తామే నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. దీంతో... ఇంతకాలం హెచ్1బీ వీసాదారులు, ఎల్1, ఎల్2 వీసాదారులే అభద్రతా భావంతో ఉన్నారనుకుంటే.. గ్రీన్ కార్డ్ కలిగి ఉన్నవారికి కూడా షాక్ తప్పదా అనే చర్చ తెరపైకి వచ్చింది!
కాగా... అమెరికా చట్టాల ప్రకారం గ్రీన్ కార్డు పొందిన వ్యక్తి నుంచి కొన్ని సందర్భాల్లో దాని తిరిగి తీసుకోవచ్చు. అయితే.. సదరు వ్యక్తి నేరాలకు పాల్పడినా, సుదీర్ఘకాలం పాటు అమెరికాలో నివసించకపోయినా.. ఇదే సమయంలో వలస నిబంధనలు పాటించడంలో విఫలమైనా అతడి నుంచి గ్రీన్ కార్డును ఆ దేశం వెనక్కి తీసేసుకుంటుంది.
మరోపక్క... గ్రీన్ కార్డుకు పోటీగా గోల్డ్ కార్డ్ విధానాన్ని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. 5 మిలియన్ డాలర్లు చెల్లించి ఎవరైనా ఈ కార్డును పొందొచ్చు. దీంతో.. అమెరికా పౌరసత్వం కూడా సాధించుకోవచ్చని ట్రంప్ సర్కార్ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు, ఎగ్జిక్యూటివ్ లను ఆకర్షించడానికి ట్రంప్ వేసిన ప్లాన్ గా దీన్ని చెబుతారు!