Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ కు అమెరికా 'అణు' హ్యాండ్..అగ్ర రాజ్యాన్ని నమ్మితే అంతే

ఒక చిన్న దేశమైన ఉక్రెయిన్ వద్ద అన్ని వేల అణ్వాయుధాలు ఉంటే ప్రమాదకరం. పైగా కొత్తగా ఏర్పడిన దేశం.

By:  Tupaki Desk   |   2 Dec 2024 9:30 AM GMT
ఉక్రెయిన్ కు అమెరికా అణు హ్యాండ్..అగ్ర రాజ్యాన్ని నమ్మితే అంతే
X

'నువ్వు నాటోలో చేరు.. రష్యా నుంచి ముప్పు ఉండదు..' అని ఉక్రెయిన్ ను రెచ్చగొట్టింది అమెరికా. దాని మాటలు నమ్మితే ఏం జరిగింది..? దాదాపు మూడేళ్లయినా నాటో సభ్యత్వం దక్కనేలేదు. 'రష్యాపై యుద్ధం చెయ్. మేం ఆయుధాలు ఇస్తాం' అని చెప్పింది అమెరికా. దీనిని నమ్మి ముందుకెళ్లిన ఉక్రెయిన్ ఇప్పుడు కోలుకోలేనంత నష్టపోయింది. ఇక యుద్ధం ముదిరిన వేళ ఇప్పుడు అమెరికా పెద్ద హ్యాండే ఇచ్చింది.

అప్పట్లో అణు నిరాయుధీకరణ చేసి..

1990లో సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ వేరుపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఉక్రెయిన్ వద్ద ఉన్న అణ్వాయుధాలు అక్షరాలా 5 వేలు పైనే. ప్రచ్ఛన్న యుద్ధం (కోల్డ్‌ వార్‌) ముగిసే సమయానికి బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా కంటే అత్యధిక అణ్వాయుధాలు ఈ దేశం వద్దనే ఉన్నాయి. ఇన్ని ఆయుధాలు సోవియట్ యూనియన్ నుంచి వారసత్వంగా ఉక్రెయిన్ కు వచ్చాయి. ఆ సమయంలో అణ్వస్త్రాల విషయంలో రష్యా, అమెరికా తర్వాత మూడో స్థానం ఉక్రెయిన్ దే కావడం గమనార్హం. వీటికి 33 హెవీ బాంబర్లు కూడా అదనం.

సొంత వారే చేతులెత్తేయడంతో..

ఒక చిన్న దేశమైన ఉక్రెయిన్ వద్ద అన్ని వేల అణ్వాయుధాలు ఉంటే ప్రమాదకరం. పైగా కొత్తగా ఏర్పడిన దేశం. దీంతో అణ్వాయుధాల నిర్వహణ విషయంలో దేశానికి విశ్వాసంగా ఉంటామని సైనికులు, కమాండర్లను ప్రతిజ్ఞ చేయమని కోరగా.. కొందరు నిరాకరించారు. ఇది మరింత ప్రమాదకరం కావడంతో అణు నిరాయుధీకరణ అంటూ బ్రిటన్‌, రష్యా, అమెరికా రంగంలోకి దిగాయి. 1994లో ఉక్రెయిన్ తో ఒప్పందం చేసుకున్నాయి. అప్పటి అమెరికా, రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులు బిల్ క్లింటన్, బోరిస్ ఎల్సిన్, లియోనిడ్‌ కుచ్‌మా, బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్ 1994 డిసెంబర్‌ 5న హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌ లో ఈ ఒప్పందంపై సంతకం చేశారు.

ఈ లెక్కన ఉక్రెయిన్‌ అణ్వాయుధాలను నాశనం చేయాలి. ఆ దేశానికి వ్యతిరేకంగా ఈ దేశాలు సైనిక శక్తిని ప్రయోగించకూడదు. 1996 నాటికి చిట్టచివరి అణ్వాయుధాన్ని కూడా రష్యాకు అప్పగించింది ఉక్రెయిన్. కాగా, నాడు మధ్యవర్తిత్వంలో ముఖ్యమైన పాత్ర పోషించింది అమెరికా. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ ఇలా వదులుకున్న అణ్వాయుధాలను తిరిగి అప్పగించబోమని అమెరికా స్పష్టం చేసింది. తమ వాగ్దానం 'చట్టపరమైన హామీ వలే' అని మాత్రమేనని, చట్టపరమైన హామీ అని మాత్రం చెప్పలేదని పేర్కొంది.

ఉక్రెయిన్‌ సొంతంగా రక్షించుకుంటూ రష్యాపై పోరాడేలా మాత్రమే సాయం చేస్తున్నామని అమెరికా తెలిపింది. కాగా, ఇటీవల ఉక్రెయిన్ కు తాము అందించిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగం మీదకు ప్రయోగించేలా బైడెన్ అనుమతిచ్చారు. ఇది యుద్ధంలో చాలా ప్రమాదకర పరిస్థితులకు దారితీసే నిర్ణయం. ఇలానే ఉక్రెయిన్ కు అణ్వాయుధాలు తిరిగి ఇవ్వాలని బైడెన్‌ కు కొందరు సూచించారని ఇటీవల న్యూయార్క్ టైమ్స్ లో కథనం వచ్చింది. దీంతోనే అమెరికా సర్కారు స్పందించింది.