వణికిన అమెరికా మార్కెట్లు..రూ.350 లక్షల కోట్లు ఆవిరి..మాంద్యం దిశగా ప్రపంచం
‘‘అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచం తుమ్ముతుంది’’.. ఇదీ అమెరికా మార్కెట్లు దెబ్బతింటే ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్పేందుకు వాడే సామెత.
By: Tupaki Desk | 11 March 2025 5:56 PM IST‘‘అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచం తుమ్ముతుంది’’.. ఇదీ అమెరికా మార్కెట్లు దెబ్బతింటే ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్పేందుకు వాడే సామెత. ఇప్పుడు మల్లీ అలాంటి పరిస్థితే వచ్చిందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. కొద్ది వ్యవధిలో రూ.349 లక్షల కోట్ల సంపద ఆవిరి కావడం.. అమెరికా మార్కెట్లు గజగజలాడడమే దీనికి కారణం.
వారాల వ్యవధిలోనే 4 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరి.. ఇదీ ప్రస్తుతం అమెరికా స్టాక్ మార్కెట్ల పతనం తీవ్రత. దీంతో ప్రపంచం వణికిపోతోంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక వివాదాస్పద నిర్ణయాలతో అమెరికా తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్ల వంతు వచ్చింది.
అగ్ర రాజ్యం మార్కెట్లు 20 రోజులలోనే కుప్పకూలాయి. మదుపర్ల సంపద రూ.349 లక్షల కోట్లు (4 ట్రిలియన్ డాలర్లు ) ఆవిరైంది. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల జీడీపీ కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం.
ట్రంప్ ముంచేస్తారా..??
ట్రంప్ అంటే ఎంతటి తెంపరి వ్యక్తో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన నిర్ణయాలే.. చేటు చేసేలా ఉన్నాయి. అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ భయాలు సూచీలను వెంటాడుతున్నాయి.
ఎస్‌అండ్‌పీ 500 సూచీ ఫిబ్రవరి 19వ తేదీన నమోదు చేసిన ఆల్ టైమ్ హై నుంచి ఇప్పటికి 8 శాతానికిపైగా విలువ కోల్పోయింది. నాస్ డాక్ కాంపోజిట్ డిసెంబరులో నమోదు చేసిన అత్యధిక విలువ నుంచి 10శాతం పతనమైంది. ఇక ఒక్క సోమవారమే 1.7 ట్రిలియన్ డాలర్ల సంపద కరిగిపోయింది. 2022 సెప్టెంబరు తర్వాత ఈ స్థాయిలో పతనం తొలిసారి.
అపర కుబేరుడికీ షాక్..
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా షేర్ ధర 15 శాతం పతనం కావడం గమనార్హం. డిసెంబరు 17 నుంచి చూస్తే దీని విలువ 50శాతం ఆవిరైంది. 479.86 డాలర్ల నుంచి 222.15 డాలర్లకు పడిపోయింది.
అమెరికా మార్కెట్ల పతనానికి వివిధ కారణాలు ఓ ప్యాకేజీలా పనిచేస్తున్నాయి. వాణిజ్య విధానాల్లో హఠాత్తుగా వస్తున్న మార్పులు, ఆర్థిక మాంద్యం భయాలు, స్టాక్స్ అధిక విలువలు వీటిలో కొన్ని. ప్రధాన వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో, ఐరోపాతో వాణిజ్య యుద్ధాలతో చాలా కంపెనీలు తమ వ్యాపార వ్యూహాలను పునః పరిశీలిస్తున్నాయట.
అమెరికా అతి సంపన్నులపై మార్కెట్ల పతనం ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఎందుకంటే మార్కెట్లలో 50 శాతం విలువైన సంపద 1 శాతం మంది వద్ద, 37 శాతం విలువైన సంపద 10శాతం మంది వద్ద ఉండడమే. 12శాతం వాటా 40శాతం మంది వద్ద కేంద్రీకృతమైంది. మిగిలిన 1శాతం వాటా 50శాతం మంది ప్రజల చేతిలో ఉంది
దేశం మార్పు దశలో ఉందని అంటున్న ట్రంప్ మాటలు.. మాంద్యం రాదనేందుకు హామీగా నిలవడం లేదు. తాము పెద్ద కార్యమే చేపట్టామని అంటున్నారు. మార్కెట్ పతనానికి, ఆర్థిక మాంద్యానికి ట్రంప్ సర్కారు సిద్ధమైందనే సంకేతాలు ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గోల్డ్ మన్ శాక్స్ కూడా అమెరికాలో వచ్చే 12 నెలల్లో ఆర్థిక మాంద్యం వచ్చేందుకు 15-20శాతం చాన్స్ ఉందని చెప్పింది.
కొసమెరుపు: అమెరికా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చెప్పాలంటే.. ఆరు నెలల్లో ట్రంప్ రూ.6 కోట్ల కోట్లు అప్పు తీర్చాల్సి ఉందట. అమెరికా మొత్తం అప్పుల్లో ఇది 31 శాతానికి సమానం. ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ఈ అప్పులను ఎలా రీఫైనాన్స్ చేయాలా? అని ట్రంప్ తలపట్టుకుని కూర్చున్నారు.