Begin typing your search above and press return to search.

ట్రంప్ నెల జీతం 30 రూ.లక్షలు.. భత్యాలు రూ.15 లక్షలు

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఏటా 4 లక్షల డాలర్లు (రూ.3.46 కోట్లు) గౌరవ వేతనం పొందుతారు. ఇది నెలకు రూ.30 లక్షలు.

By:  Tupaki Desk   |   20 Jan 2025 5:30 PM GMT
ట్రంప్ నెల జీతం 30 రూ.లక్షలు.. భత్యాలు రూ.15 లక్షలు
X

అమెరికా అంటే అగ్ర రాజ్యం.. దాని అధ్యక్షుడు అంటే.. భూమ్మీద పవర్ ఫుల్ లీడర్.. పరోక్షంగా ప్రపంచ నాయకుడే.. మరి ఆయనకు లభించే జీత భత్యాలు ఏమిటి..? ఆ స్థాయి నాయకుడికి ఎంత వేతనం ఇస్తారు..? అందులోనూ డొనాల్డ్ ట్రంప్ వంటి అపర కుబేరుడికి ఏం ఇస్తారు..? అనేవి ఆసక్తికర అంశాలు. మరికొద్ది గంటల్లో ట్రంప్ అధ్యక్ష పీఠంపై కూర్చోబోతున్నారు. మరి ఆయనకు దక్కేదేమిటో చూద్దాం..

విస్తీర్ణంలోనూ, డెవలప్ మెంట్ లోనూ, ఆర్థికంగానూ అమెరికా అగ్రరాజ్యం. అయితే సింగపూర్, కెన్యా, స్విట్జర్లాండ్ అధ్యక్షులు, ఆస్ట్రేలియా ప్రధాని కంటే అమెరికా అధ్యక్షుడి జీతం తక్కవేనట..

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఏటా 4 లక్షల డాలర్లు (రూ.3.46 కోట్లు) గౌరవ వేతనం పొందుతారు. ఇది నెలకు రూ.30 లక్షలు. వాస్తవానికి ప్రతి దేశంలోనూ కొన్నేళ్లుగా వేతనాలు పెరిగి ఉంటాయి. చిత్రంగా అమెరికాలో మాత్రం 2001 నుంచి మార్పుల్లేవంటే ఆశ్చర్యపోవాల్సిందే. అంటే దాదాపు 25 ఏళ్లగా పెంపు లేకుండా ఒకటే వేతనాన్ని అధ్యక్షుడికి చెల్లిస్తున్నారు.

జీతాన్ని మించి ప్రాధాన్యం..

వేతనం సంగతి పక్కన పెడితే అమెరికా అధ్యక్షుడికి అందే అదనపు భత్యాలు, సౌకర్యాలు మాత్రం ఇతర దేశాధినేతల కంటే వేరే లెవల్.

అమెరికా అధ్యక్షుడు ప్రపంచ నేతనే కాదు.. ప్రపంచమంతా ముప్పు పొంచి ఉన్న నాయకుడు. అందుకనే ఆ స్థానంలో ఉన్వారికి భద్రతాపరంగా ఆధునిక సౌకర్యాలతో కూడిన నిఘా వ్యవస్థ ఆయన చుట్టూ కనిపిస్తుంది.

నెల జీతంలో సగం స్థాయిలో అమెరికా అధ్యక్షుడి నెల వేతనం రూ.30 లక్షలు అని చెప్పుకొన్నాం కదా..? ఇందులో దాదాపు సగం స్థాయిలో భత్యాలు చెల్లిస్తారు. ఆఫీస్ మెయింటెనెన్స్, వ్యక్తిగత సిబ్బంది.. ఇతర అవసరాలకు రూ.43 లక్షలు, అధ్యక్షుడి ట్రావెల్ అలవెన్స్ రూ.86 లక్షలు, వినోద భత్యంగా రూ.16 లక్షలు, అధికారిక నివాసం వైట్ హౌస్ అలంకరణ, నిర్వహణ కు ఏటా రూ.86 లక్షలు చెల్లిస్తారు. ఈ మొత్తంగా జీతం - అలవెన్సులు కలిపితే అధ్యక్షుడికి ఏటా రూ .4.92 కోట్ల అందుతాయి.

ఎగిరే స్టార్ హోటల్..

అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్. దీని సర్వీసు, మెరైన్ వన్ సర్వీసు, సాయుధ లగ్జరీ కారు అందుబాటులో ఉంటుంది. భద్రతా వ్యవహారాలను సీక్రెట్ సర్వీస్ చూస్తుంది. అధ్యక్షుడి ఆరోగ్య ఖర్చులన్నీ ప్రభుత్వానివే.

కొసమెరుపు: ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడు కూడా. 2020-24 మధ్య ఆయన పదవిలో లేరు. ఆ సమయంలో మాజీ అధ్యక్షుడిగా ఏటా రూ 1.99 కోట్ల పింఛను పొందారు. కార్యాలయం, నివాసం, వైద్య సేవలు ఉచితం. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అధ్యక్షుడి హోదాలో జీతం, భత్యం పొందనున్నారు.