Begin typing your search above and press return to search.

ట్రంప్‌ వర్సెస్‌ కమల.. ఏ రాష్ట్రాలు ఎవరి వైపు?

ఈ ఏడాది నవంబర్‌ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Sep 2024 4:30 PM GMT
ట్రంప్‌ వర్సెస్‌ కమల.. ఏ రాష్ట్రాలు ఎవరి వైపు?
X

ఈ ఏడాది నవంబర్‌ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో అమెరికా ఏకైక సూపర్‌ పవర్‌ కావడంతో సర్వత్రా ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఇద్దరూ హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ట్రంప్, హారిస్‌ మధ్య జరిగిన తొలి డిబేట్‌ లో ట్రంప్‌ తేలిపోయారు. కమల గట్టి వాదనలతో ట్రంప్‌ కు ముచ్చెమటలు పట్టించారు.

ఈ నేపథ్యంలో అమెరికాలో రాష్ట్రాల వారీగా ట్రంప్, కమల హారిస్‌ ల్లో ఎవరు ఆధిక్యంలో ఉన్నారనేది ఆసక్తి రేపుతోంది.

కమలా హారిస్, ట్రంప్‌ మొదటిసారిగా నేరుగా డిబేట్‌ లో తలపడిన ఫిలడెల్ఫియాలో ఇటీవల జరిగిన చర్చ తర్వాత కమలా హారిస్‌ కు మద్దతు పెరిగిందని సర్వేలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్‌ పై కమలా హారిస్‌ స్వల్పంగా 2.8 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి.

ఇపోసస్‌ – రాయిటర్స్‌ నిర్వహించిన కొత్త సర్వేలో డోనాల్డ్‌ ట్రంప్‌ పై కమలా హారిస్‌ 5 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం మీద ట్రంప్‌ కు 42 శాతం మద్దతు ఉండగా హారిస్‌ కు 47 శాతం మద్దతు ఉంది.

కీలకమైన జార్జియా, నెవాడా, నార్త్‌ కరోలినా వంటి రాష్ట్రాల్లో కమలా హారిస్, ట్రంప్‌ మధ్య గట్టి పోటీ ఉంది. ఇక్కడ ఇద్దరూ సమ ఉజ్జీలుగా ఉన్నారు.

ఇక ఫ్లోరిడా, అరిజోనాల్లో స్వల్ప ఆధిక్యంలో, ఒహియో, టెక్సాస్‌ లలో గట్టి బలంతో ట్రంప్‌ దూసుకుపోతున్నారు.

కమలా హారిస్‌ మేరీల్యాండ్, కొలరాడో, వర్జీనియా రాష్ట్రాల్లో దూసుకుపోతున్నారని సర్వేలు పేర్కొంటున్నాయి. ఇటీవల జరిగిన తొలి డిబేట్‌ లో కమలా హారిస్‌ విజేతగా నిలిచారని చాలా సర్వేలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఈ చర్చ తర్వాత ఆమె విజయావకాశాలు గణనీయంగా పెరిగాయని చెబుతున్నాయి.

కొంతమంది రిపబ్లికన్‌ పార్టీ వ్యక్తులు సైతం కమలా హారిస్‌ కే గెలుపు అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. తమ అభ్యర్థి ట్రంప్‌ పనితీరు ఇంకా మెరుగుపడాలని కోరుకుంటున్నారు.

స్వతంత్రులు, కొంతమంది రిపబ్లికన్‌ లతో సహా ఓటర్లు కూడా ట్రంప్‌ ను కమల అధిగమించారని భావిస్తున్నారు. ముఖ్యంగా, రిపబ్లికన్‌లలో 14% మంది కమలా హారిస్‌ గెలుపొందుతారని నమ్ముతున్నారు. అలాగే స్వతంత్ర ఓటర్లలో సగం మంది దీన్ని అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమలా హారిస్, ట్రంప్‌ ఇద్దరూ క్లిష్టమయిన రాష్ట్రాలపై దృష్టిని కేంద్రీకరించారు.