అమెరికా కేన్సాస్ నగరంలో వేలాది సాక్షిగా కాల్పులు!
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. గన్స్ మోతలు మారుమోగటమే కాదు.. అప్పటివరకు సందడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారింది.
By: Tupaki Desk | 15 Feb 2024 4:28 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. గన్స్ మోతలు మారుమోగటమే కాదు.. అప్పటివరకు సందడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారింది. అసలేం జరుగుతుందో అర్థం కాని గందరగోళం చోటు చేసుకుంది. తరచూ కాల్పుల కలకలం చోటుచేసుకోవటం.. అమాయకులు ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. తాజాగా మిస్సౌరిలోని కేన్సాన్ నగరం ముగ్గురు ఆగంతకుల కాల్పులకు వేదికగా మారింది.
సూపర్ బౌల్ విజేతగా నిలిచిన కేన్సాస్ సిటీ చీప్స్ పరేడ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు హాజరయ్యారు. అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతున్న పరేడ్ లో ఒక్కసారిగా కాల్పులు మొదలయ్యాయి. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణరహితంగా కాల్పులు మొదలు పెట్టారు.
దీంతో ఒక్కసారిగా భీతావహ పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ప్రాణభయంతో ఎవరికి వారు పరుగులు తీయటం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో కాల్పుల కారణంగా ఒకరు మరణిస్తే.. 22 మంది గాయపడ్డారు. వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి.. వైద్య చికిత్సలు చేయిస్తున్నారు.
కాల్పుల ఘటనపై కేన్సాస్ సిటీ చీప్స్ ఆర్గనైజర్స్ స్పందించారు. పరేడ్ ముగిసే వేళలో జరిగిన ఈ దారుణం బాధాకరమన్నారు. బాధితులకు సానుభూతిని వ్యక్తం చేసిన ఆయన.. ఈ ఘటనలో ఆటగాళ్లు.. కోచ్ లు.. సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు కేన్సాన్ జట్టు ప్రకటించింది. అమెరికా జాతీయ పుట్ బాల్ లీగ్ లో భాగమైన సూపర్ బౌల్ ఛాంపియన్ షిప్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో కేన్సాస్ జట్టు శాన్ ఫ్రాన్సిస్కోపై గెలిచింది. దీంతో ఈ జట్టు విజయోత్సవాల్ని చేపట్టింది. ఈ సందర్భంగా అనూహ్య పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాల్పులకు కారణంగా భావిస్తున్న ముగ్గురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నట్లుగా కేన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ పేర్కొన్నారు.