Begin typing your search above and press return to search.

అమెరికా కన్నుపడిన ఆ 3 కి.మీ. ఆ ద్వీపమే.. హసీనా కొంప ముంచింది

ఆదివారం ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఆమె పేర్కొన్నది సెయింట్ మార్టిన్స్ ద్వీపం గురించి.

By:  Tupaki Desk   |   12 Aug 2024 1:30 PM GMT
అమెరికా కన్నుపడిన ఆ 3 కి.మీ. ఆ ద్వీపమే.. హసీనా కొంప ముంచింది
X

సరిగ్గా వారం రోజులైంది.. దాదాపు తెలంగాణకు కాస్త ఎక్కువ విస్తీర్ణం ఉండే బంగ్లాదేశ్ లో వరుసగా నాలుగోసారి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన షేక్ హసీనా ఏడు నెలల్లో పదవిని కోల్పోవడం ఏమిటి..? రిజర్వేషన్ల తగ్గింపు ఆందోళన చివరకు ప్రధాని పీఠానికి ఎసరు పెట్టడం ఏమిటి? ఇదంతా ఓ కలలా జరిగిపోయింది కదా..? కానీ.. దీనివెను అమెరికా హస్తం ఉందని హసీనా ఇప్పటికే ఆరోపించారు. ఆదివారం ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఆమె పేర్కొన్నది సెయింట్ మార్టిన్స్ ద్వీపం గురించి.

అగ్ర రాజ్యాన్ని అడుగు పెట్టనీయక..

బంగాళాఖాతం ఈశాన్యంలో ఉంటుంది సెయింట్‌ మార్టిన్స్‌ ద్వీపం. అమెరికా సంగతి తెలుసు కదా.. ప్రపంచంలో ప్రతి మూలనా తన సైనిక స్థావరం ఉండాలనేది దారి దుర్భిద్ధి. ఇలానే సెయింట్ మార్టిన్స్ ద్వీపంలో కాలుపెట్టాలనేది అమెరికా ఆలోచన. ఇది బంగ్లాదేశ్ ఆధీనంలోని ద్వీపం కావడంతో హసీనా అనుమతి ఇవ్వలేదు. పగడపు దీవి అయిన దీనికి దక్షిణ బంగ్లాలోని ప్రముఖ వాణిజ్య ప్రాంతం కాక్స్ బజార్ కేవలం 9.5 కిలోమీటర్లు. అక్కడివారికి ఇది నారికేళ్ల జింజిరా లేదా కొకొనట్ ఐల్యాండ్. సెయింట్ మార్టిన్స్ జనాభా 3,700. చేపల వేట, వరి పంట, కొబ్బరి తోటలు సాగు చేస్తుంటారు. సీవీడ్‌ సాగుకూ ఇది ప్రసిద్ధి. దీనిని వారు మయన్మార్‌ కు ఎగుమతి చేస్తారు.

18వ శతాబ్ధంలో సెయింట్ మార్టిన్స్ కు వచ్చిన అరబ్బులు జజిరాగా పేరు పెట్టారు. 1900ల్లో బ్రిటీష్ వారు చేజిక్కించుకుని భారత్ లో కలిపారు. క్రైస్తవ మత గురువు సెయింట్‌ మార్టిన్స్‌ పేరు పెట్టారు. చిట్టగాంగ్‌ డిప్యూటీ కమిషనర్‌ గా ఉన్న మార్టిన్స్ గౌరవార్థం కూడా ఆయన పేరు పెట్టినట్లు చెబుతారు. అఖండ భారత్ విభజన అనంతరం తూర్పు పాకిస్థాన్‌ కు తర్వాత బంగ్లాదేశ్‌ కు చెందింది. ఈ దీవి బంగ్లాదేనని 1974లో మయన్మార్‌ కూడా ఒప్పుకొంది. అయితే, సముద్ర సరిహద్దులను గుర్తించలేదు. దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బంగ్లా జాలర్ల పడవలపై మయన్మార్‌ దళాలు కాల్పులు జరపడం తరచూ జరుగుతోంది. ఇక మయన్మార్‌ సైన్యం దమనకాండ మొదలుపెట్టాక ముస్లింలైన రోహింగ్యాలు కాక్స్‌ బజార్‌ సమీపంలోని కుటుపలాంగ్‌ లో తలదాచుకున్నారు. వీరికి మద్దతుగా ఉండే అరకాన్‌ సైన్యం ఇటీవల సెయింట్‌ మార్టిన్స్‌ ద్వీపం తమదేనని ప్రకటించింది. బంగ్లా ప్రభుత్వం దీన్ని తోసిపుచ్చింది. అయితే, అరకన్‌ ఆర్మీతో గొడవల నేపథ్యంలో సెయింట్ మార్టిన్స్ పై మయన్మార్‌ దాడులు చేస్తూ ఉంటుంది. దీంతో బంగ్లా నౌకా దళాన్ని మోహరించింది.

బంగాళాఖాతంలో పలు దేశాల మధ్యన ఉంటుంది సెయింట్ మార్టిన్స్. దీంతో చైనాకు చెక్ పెట్టాలంటే ఈ ద్వీపంపై కాలుమోపాలనేది అమెరికా ఆలోచన. సైనిక స్థావరం నిర్మిస్తే.. ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన మలక్కా జలసంధిపై నేరుగా పట్టు దొరుకుతుంది. ఇక మరో అత్యంత కీలకమైన కాక్స్‌ బజార్‌ పోర్టును చైనా నిర్మిస్తోంది. కాబట్టి దీనికి సమీపంలో ఉండే సెయింట్ మార్టిన్స్ నిఘాకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందనేది అమెరికా ఆలోచన. ఇక్కడినుంచే చైనా, మయన్మార్‌ పై ఒకేసారి నిఘా పెట్టేందుకు ఎత్తుగడ ఇది. అయితే, హసీనా మాత్రం ససేమిరా అనడంతో.. బంగ్లాలో ఆందోళనలకు చిచ్చుపెట్టి ఆమెను పదవి నుంచి దిగిపోయేలా చేసింది.