Begin typing your search above and press return to search.

ట్రంప్ కు మరో షాక్.. తలుపులు ముసుకుంటున్నాయా?

ఇప్పటికే ఆయన్ను అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంలో కొలరాడో కోర్టు ప్రకటన చేయటం తెలిసిందే

By:  Tupaki Desk   |   29 Dec 2023 5:10 AM GMT
ట్రంప్ కు మరో షాక్.. తలుపులు ముసుకుంటున్నాయా?
X

ఏది ఏమైనా సరే.. మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలి.. దేశాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న డొనాల్ట్ ట్రంప్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి నిలిచేందుకు ఆయన్ను అనర్హుడిగా పేర్కొంటూ కొలరాడో కోర్టు ప్రకటించిన పది రోజులకే మరో రాష్ట్రం అదే తరహాలో షాకివ్వటం గమనార్హం. తాజాగా మొయిన్ స్టేట్.. ట్రంప్ ను అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించటం సంచలనంగా మారింది. ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతున్న వేళ.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఉన్న అవకాశాలు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నట్లుగా చెబుతున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత అమెరికా చట్టసభ క్యాపిటల్ మీద జనవరి ఆరో తేదీన ట్రంప్ మద్దతుదారులు దాడి చేయటం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కలలో కూడా ఊహించని ఈ పరిణామం అమెరికన్లను నిర్ఘాంతపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ పై బోలెడన్ని కేసులు నమోదయ్యాయి. తాజాగా మొయిన్ స్టేట్ తరఫున పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడంటూ ఆ రాష్ట్ర ఎన్నికల విభాగం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర కార్యదర్శి షెన్నా బెల్లోస్ ప్రకటన చేయటం ట్రంప్ కు మరో ఎదురుదెబ్బగా చెప్పక తప్పదు.

ఇప్పటికే ఆయన్ను అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంలో కొలరాడో కోర్టు ప్రకటన చేయటం తెలిసిందే. అమెరికా చరిత్రలో ఇలా అధ్యక్ష పదవికి పోటీ పడే అభ్యర్థి నేతపై ఇలాంటి నిర్ణయం రావటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ హింసకు ప్రేరేపించారన్న వాదనకు బలం చేకూరే సాక్ష్యాలు బోలెడన్ని ఉన్నట్లుగా చెబుతున్నారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 రూల్ ప్రకారం.. ఆయన్ను ప్రైమరీ ఎన్నికల్లో పోటీకి అనర్హరుడిగా నిర్ణింయించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఒకే ఒక్క దారి.. అమెరికా సుప్రీంకోర్టులో ఊరట లభించటం. కొలరాడోకోర్టు ఇచ్చిన తీర్పును తప్పు పడుతూ సుప్రీంకోర్టు కానీ తీర్పువస్తే ఫర్లేదు. అలా కాకుండా కింది కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తే మాత్రం రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలన్న ట్రంప్ కల నెరవేరటం క్లిష్టమవుతుందని చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 5న రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికలు.. నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు వచ్చినప్పటికి 2025లో మాత్రమే అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టాల్సి ఉంటుంది.