Begin typing your search above and press return to search.

అమెరికాను ఊపేస్తున్న వివేక్‌!

త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి భారతీయ అమెరికన్లు కూడా మొగ్గు చూపుతున్నారు

By:  Tupaki Desk   |   28 Aug 2023 6:06 AM GMT
అమెరికాను ఊపేస్తున్న వివేక్‌!
X

త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి భారతీయ అమెరికన్లు కూడా మొగ్గు చూపుతున్నారు. మొత్తం ముగ్గురు భారతీయులు రిపబ్లికన్‌ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. వారిలో వివేక్‌ రామస్వామి ఒకరు. అలాగే ఆయనతోపాటు నిక్కీ హీలీ, హిర్ష్ వర్ధన్‌ సింగ్‌ అనే మరో ఇద్దరు భారత సంతతి వారు కూడా రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు. మరోవైపు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా పోటీలో ఉన్నారు.

కాగా రామస్వామి తల్లిదండ్రులు కేరళ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. వివేక్‌ అక్కడే జన్మించారు. ఇప్పటికీ ఆయన కుటుంబం హిందూ సంప్రదాయాలనే అనుసరిస్తుంది. పుట్టుకతోనే అమెరికా పౌరుడు కాబట్టి అధ్యక్ష పదవికి ఆయన అర్హుడుగా మారారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి బయాలజీ చదివిన రామస్వామి... యేల్‌ లా స్కూల్‌ నుంచి లా అభ్యసించారు. ఈయన భార్య అపూర్వ వైద్యురాలు. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.

కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో వివేక్‌ రామస్వామి అత్యంత దూకుడుగా తన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఆయన నిత్యం ప్రజల మధ్యే గడపుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా పలు న్యూస్‌ చానళ్లకు ఇంటర్వ్యూలిస్తున్నారు. తద్వారా రిపబ్లికన్‌ పార్టీ తరఫున తన అభ్యర్థిత్వాన్ని బలపరచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్‌ రామస్వామిపై టెస్లా, ట్విట్టర్‌ కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ సైతం ప్రశంసలు కురిపించారు. రామస్వామి నమ్మకమైన అభ్యర్థి అని కొనియాడారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థకు వివేక్‌ రామస్వామి ఇచ్చిన ఇంటర్వ్యూను షేర్‌ చేస్తూ ఎలాన్‌ మస్క్‌ ఈ మాట చెప్పడం విశేషం. ఇలా అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఏమిటి ఒక మెక్‌ డొనాల్డ్‌ మేనేజర్, ఒక చర్చి పాస్టర్‌ ఇలా అంతా వివేక్‌ రామస్వామి అభిమానులుగా మారిపోతున్నారు.

ఈ నేపథ్యంలో భారతీయ సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి పేరు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మారుమోగిపోతోంది. అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న అమెరికా ఓటర్లను.. ముఖ్యంగా రిపబ్లికన్లకు 38 ఏళ్ల రామస్వామి ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ తరఫున గట్టి అభ్యర్థి అవుతారనుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ కేసుల వెంట తిరుగుతుంటే... అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రోజురోజుకూ రామస్వామి దూసుకుపోతున్నారు.

తాను అనుకున్నది ముక్కుసూటిగా చెప్పడం, మనసులో ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించడం వివేక్‌ రామస్వామిని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. సంప్రదాయ క్రిస్టియన్‌ పద్దతులకు మొగ్గు చూపే రిపబ్లికన్‌ పార్టీ అభిమానులను సైతం హిందూ కుటుంబానికి చెందిన భారతీయ సంతతి రామస్వామి ఆకర్షిస్తుండటం విశేషంగా మారింది.

ముఖ్యంగా జాతి వివక్ష, సామాజిక న్యాయాల విషయంలో రామస్వామి వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు అందరిలో చర్చకు దారితీస్తున్నాయి. అంతా ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. ట్రంప్‌ మాదిరిగా నల్లజాతివారిపై శ్వేత జాతీయులను ఆయన రెచ్చగొట్టడం లేదు. అలాగే శ్వేతజాతి వారిని చిన్నచూపు చూడటం, కించపరచటం, రివర్స్‌ రేసిజం చూపటం వంటివి ఆయన చేయడం లేదు. ఇలా చేసినా కూడా తప్పేనని ఆయన అమెరికన్లకు వివరిస్తున్నారు. దీంతో ట్రంప్‌ ను అభిమానించేవారు సైతం రామస్వామి వైపు మొగ్గుచూపక తప్పడం లేదు.

అలాగే కొన్ని వివాదాస్పద అంశాలపై మాట్లాడటానికి అభ్యర్థులెవరూ మొగ్గు చూపడం లేదు. అలాంటి విషయాల్లోనూ వివేక్‌ రామస్వామి తన అభిప్రాయాలను ఎలాంటి భయం, బెరుకు లేకుండా వెల్లడించడం విశేషం. ముఖ్యంగా అబార్షన్‌ లపైన అమెరికాలో వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. అబార్షన్‌ హక్కు కావాల్సిందేనని మహిళలు నినదిస్తున్నారు. అయితే రామస్వామి మాత్రం కొన్ని ప్రత్యేక పరిస్థితులను మినహాయించి అబార్షన్‌ లకు తాను వ్యతిరేకమని ధైర్యంగా ప్రకటించారు.

అలాగే అమెరికా ఆర్థిక విధానాలకు సంబంధించి డెమెక్రాట్ల మాదిరిగా తాయిలాలు ప్రకటించకపోవడం, ప్రతి విధాన నిర్ణయాన్ని ఎంతో తర్కంగా వ్యవహరిస్తున్న తీరు అమెరికన్లను ఆకట్టుకుంటున్నాయి.

అదేవిధంగా మతం విషయంలో రామస్వామి నిశ్చితాభిప్రాయాలు ప్రకటిస్తున్నారు. తాను హిందూ మతస్తుడిని అయినప్పటికీ అమెరికాలో అత్యధికంగా ఉన్న క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరిస్తున్నారు. మతాలేవైనా మంచి కోసమే అంటూ ఆయన బైబిల్‌ ను కూడా వల్లెవేస్తున్నారు. ''నేను క్రై స్తవంలో పెరగలేదు.. కానీ మనందరం అనుసరించే విలువలు ఒక్కటే'' అంటూ మానవతా విలువలను రామస్వామి చాటుతున్నారు.

ఈ నేపథ్యంలోనే అమెరికా సంపన్నుల్లో పేరొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బిల్‌ అక్‌ మాన్‌... వివక్షపై రామస్వామి వాదన విన్న తర్వాత... ''ఈయన ఎప్పుడోసారి అమెరికా అధ్యక్షుడవుతాడు. ఆయన సందేశం కోసం సిద్ధంగా ఉండండి'' అని జోస్యం చెప్పడం విశేషం.

దేశానికి స్వాతంత్య్రం రాకముందు స్వామి వివేకానందుడు అధ్యాత్మికంగా అమెరికాను ఉర్రూతలూగిస్తే.. ఇప్పుడు అమెరికాను ఈ రాజకీయ వివేక్‌ రామస్వామి ఊపేస్తున్నాడు.