Begin typing your search above and press return to search.

మోదీ ఉక్రెయిన్‌ పర్యటన.. అమెరికా కీలక వ్యాఖ్యలు!

భారత ప్రధాని నరేంద్ర మోదీ యూరప్‌ దేశం.. ఉక్రెయిన్‌ లో తాజాగా పర్యటించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Aug 2024 9:11 AM GMT
మోదీ ఉక్రెయిన్‌ పర్యటన.. అమెరికా కీలక వ్యాఖ్యలు!
X

భారత ప్రధాని నరేంద్ర మోదీ యూరప్‌ దేశం.. ఉక్రెయిన్‌ లో తాజాగా పర్యటించిన సంగతి తెలిసిందే. ముందుగా పోలండ్‌ చేరుకున్న మోదీ ఆ దేశ అధ్యక్షుడితో పలు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అక్కడ నుంచి ఏకంగా పది గంటలపాటు ప్రయాణించి రైలులో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ కు చేరుకున్నారు. తద్వారా 1991లో నాటి సోవియట్‌ యూనియన్‌ నుంచి విడిపోయి స్వతంత్య్ర దేశంగా ఆవిర్భవించాక ఉక్రెయిన్‌ లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ రికార్డులకెక్కారు.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటనపై అగ్ర రాజ్యం అమెరికా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడి నివాసమైన వైట్‌ హౌస్‌ కార్యాలయం స్పందించింది. ప్రధాని మోదీ పర్యటనతో శాంతికి బీజం పడాలని ఆకాంక్షించింది. గత రెండేళ్లుగా రష్యా.. ఉక్రెయిన్‌ పై యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ దీనికి బ్రేక్‌ పడలేదు. రష్యా దాడుల్లో వేలాది మంది ఉక్రెయిన్‌ సైనికులు, ప్రజలు, చిన్నారులు మృత్యువాతపడ్డారు.

ఈ నేపథ్యంలో అమెరికా ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటనపై ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ పర్యటనతో శాంతికి ముందడుగు పడుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొంది. ఉక్రెయిన్‌ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేస్తున్న శాంతి ప్రయత్నాలకు మోదీ పర్యటనతో సానుకూల ఫలితం రావాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించింది.

భారత ప్రధాని మోదీ పర్యటనకు ఎంతో ప్రాధాన్యత ఉందని.. ప్రపంచ దేశాలు సైతం మోదీ పర్యటనపై ఆసక్తి చూపుతున్నాయని అమెరికా లె లిపింది. ఈ పర్యటన ద్వారా రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధానికి అడ్డుకట్ట పడితే తాము సంతోషిస్తామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా అధ్యక్ష కార్యాలయం తరఫున ఆ దేశ సెక్యూరిటీ కౌన్సిల్‌ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ ఒక ప్రకటన విడుదల చేశారు.

కాగా ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటనలో ఆ దేశ రాజధాని కీవ్‌ లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో భేటీ అయ్యారు. అక్కడ చిన్నారుల మృతికి చిహ్నంగా నిర్మించిన స్మారక కేంద్రాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. శాంతి స్థాపన కోసం భారత్‌ తన వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తుందని హామీ ఇచ్చారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని విడనాడి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

బుద్ధుడు పుట్టిన నేల నుంచి, అహింసకు మారుపేరుగా నిలిచిన మహాత్మాగాంధీ జీవించిన గడ్డ నుంచి తాను వచ్చానని ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటనలో తెలిపారు. ఇంకెంతమాత్రమూ సమయం వృథా చేయొద్దని చెప్పారు. ఇక యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా, ఉక్రెయిన్‌ లకు పిలుపునిచ్చారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో భారత్‌ ఎప్పుడూ తటస్థంగా లేదన్నారు. శాంతివైపు ఉందన్నారు.