అమెరికా రక్షణ మంత్రికి ప్రొస్టేట్ క్యాన్సర్.. అధ్యక్షుడికి చెప్పలేదు
మిగిలిన విషయాల్లో గుట్టుగా ఉన్నప్పటికి.. ఆరోగ్య సమస్యల గురించి నలుగురికి చెప్పుకోవటం మంచిదన్న తెలుగు సామెత గురించి వినే ఉంటారు.
By: Tupaki Desk | 11 Jan 2024 5:01 AM GMTమిగిలిన విషయాల్లో గుట్టుగా ఉన్నప్పటికి.. ఆరోగ్య సమస్యల గురించి నలుగురికి చెప్పుకోవటం మంచిదన్న తెలుగు సామెత గురించి వినే ఉంటారు.కానీ.. అమెరికా రక్షణ మంత్రి లాయిస్ ఆస్టిన్ మాత్రం తప్పులో కాలేశారు. 70 ఏళ్ల వయసులో కీలక శాఖకు మంత్రిగా ఉన్న ఆయన.. తాను ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధ పడుతున్న విషయాన్ని మాత్రమే కాదు.. ఇటీవల ఆసుపత్రిలో చేరి సర్జరీ చేయించుకున్న విషయాన్ని సైతం గుట్టుగా ఉంచేయటం విమర్శలకు తావిస్తోంది. ఈ తీరును పలువురు తప్పు పడుతున్నారు.
తాను ఆసుపత్రిలో చేరిన విషయాన్ని అమెరికా అధ్యక్షుల వారికి సైతం సమాచారాన్ని ఇవ్వటం ఏ మాత్రం సరికాదంటున్నారు. అధ్యక్షుడు బైడెన్ కు.. వైట్ హౌస్ సిబ్బందికి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండా మహా గుట్టును ప్రదర్శించిన వైనాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. గత నెల మొదట్లోనే ఆయన ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడిన వైనం తేలిందని.. అయినప్పటికీ ఈ విషయాన్ని ఆయన రహస్యంగా ఉంచటాన్ని పలువురు విమర్శిస్తున్నారు.
డిసెంబరు 22న ఆయనకు సర్జరీ చేయగా.. తర్వాతి రోజు ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారని.. ఆ తర్వాత మళ్లీ జనవరి 1న ఆసుపత్రిలో చేరిన వైనం అగ్రరాజ్యంలో హాట్ టాపిక్ గా మారింది. కీలక పదవుల్లో ఉండి.. అనారోగ్యానికి గురైతే.. ఆ విషయాన్ని సైతం దేశాధ్యక్షుడికి కూడా తెలీకుండా ఉంచటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారటమేకాదు.. ఈ అంశంపై విచారణకు ఆదేశించాలని కోరుతున్నారు. రాజకీయంగా తీవ్ర విమర్శలకు కారణమైన ఈ ఉదంతం నేపథ్యంలో వైట్ హౌస్ మిగిలిన మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకనుంచి ఎవరైనా అనారోగ్యానికి గురైతే.. ఆ సమాచారాన్ని అధ్యక్షుల వారికి చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు.. మహా గుట్టు ప్రదర్శించిన రక్షణ మంత్రిపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.