Begin typing your search above and press return to search.

రిలయన్స్ జియోకు గుడ్ బై చెబుతున్న యూజర్స్!

ఆరంభంలో ప్రధానంగా అందరికీ అందుబాటులో ధరల్లో అనే కాన్సెప్ట్ తో రంగంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు కనిపించిన జియో.. అనంతరం రూటు మార్చింది!

By:  Tupaki Desk   |   21 Oct 2024 4:51 AM GMT
రిలయన్స్  జియోకు గుడ్  బై చెబుతున్న యూజర్స్!
X

దేశంలోని అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో.. కొన్ని రోజుల క్రితం తన రీఛార్జ్ ప్లాన్ ల టారిఫ్ లను పెంచిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అనే తారతమ్యాలేమీ చూడకుండా రేట్లను పెంచేసింది. ఆరంభంలో ప్రధానంగా అందరికీ అందుబాటులో ధరల్లో అనే కాన్సెప్ట్ తో రంగంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు కనిపించిన జియో.. అనంతరం రూటు మార్చింది!

ఇందులో భాగంగా... ఇటీవల తన రీఛార్జ్ ప్లాన్ ల టారిఫ్ లను అమాంతం పెంచేసింది. ఇది జియో యూజర్లకు భారీ షాక్ గానే అనిపించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదీకగా ట్రోల్స్, మీమ్స్ వైరల్ గా మారాయి. జియో రీఛార్జ్ ప్లాన్స్ టారిఫ్ లని అమాంతంగా పెంచడానికి కారణాలు ఇవే అంటూ నెటిజన్లు తమ క్రియేటివిటీకి పని చెప్పారు. ఇప్పుడు తాజాగా షాక్ ఇచ్చారు.

అవును... రెండో త్రైమాసికంలో రిలయన్స్ జియో సుమారు 1.09 కోట్ల మంది వినియోగదారులను కోల్పోయిందని తెలుస్తోంది. దీంతో... పెరిగిన టారిఫ్ లే ఈ స్థాయిలో వినియోగదారులు జియోని వదిలి వెళ్లడానికి కారణం అని చెబుతున్నాయి నివేదికలు. తద్వారా ముకేష్ అంబానీకి ఆర్థికంగా ఇది ఎంత సమస్య అనే సంగతి పక్కనపెడితే.. ఇది ఒకరకంగా భారీ ఎదురుదెబ్బే అని అంటున్నారు.

ఈ సమయంలో జియోని వదిలిన చాలా మంది వినియోగదారులు.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీ.ఎస్.ఎన్.ఎల్) కు మారిపోతున్నట్లు తెలుస్తోంది. మరోపక్క జియో 5జీ సబ్ స్క్రైబర్స్ బేస్ మాత్రం పెరిగినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఈ బేస్ 17 మిలియన్లు పెరిగిందని అంటున్నారు. ఫలితంగా... యూజర్స్ బేస్ 147 మిలియన్లకు చేరుకుంది. గతంలో ఈ సంఖ్య 130 మిలియన్లుగా ఉండేది.

ఈ విషయాలపై స్పందించిన జియో... తమ యూజర్ బేస్ కు సంబంధించిన పరిస్థితుల గురించి తమకు తెలుసని.. సంస్థ లాభాలపై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపదని తెలిపింది. ఇదే సమయంలో... తమ వినియోగదారులకు అత్యుత్తమ 5జీ నెట్ వర్క్ ను అందించడంపైనే తమ దృష్టి ఉందని పేర్కొంది. అయితే... తమ వినియోగదారులను కోల్పోవడం మాత్రం ఇతర టెలికాం ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తుందని అంగీకరించింది.