తెలుగమ్మాయి కోసం అమెరికన్స్ గూగుల్ సెర్చ్... ఇవిగో వివరాలు!
అమెరికాలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన సమయంలో తన డ్రెస్ & లుక్స్ తో అందరి దృష్టినీ ఆకర్షించిన ఉషా వాన్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారారు.
By: Tupaki Desk | 23 Jan 2025 8:11 AM GMTఅమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో... అగ్రరాజ్యం ద్వితీయ మహిళ హోదాను పొందిన తొలి ఇండియన్ - అమెరికన్ గా ఉషా వాన్స్ రికార్డ్ సృష్టించారు. జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారోత్సవం వేళ ఉషా వాన్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారారు.
ఇందులో భాగంగా... తన భర్త అగ్రరాజ్యం ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్న వేళ ఒక చేతిలో పాపను, మరో చేతితో బైబిల్ ను పట్టుకుని.. జేడీ వాన్స్ వైపు చూసిన ఆమె చూపులకు ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.
అవును... అమెరికాలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన సమయంలో తన డ్రెస్ & లుక్స్ తో అందరి దృష్టినీ ఆకర్షించిన ఉషా వాన్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. ఈ సమయంలో ఈ భారత సంతతి మహిళ గురించి తెలుసుకోవాలని అమెరికన్లు ఆసక్తి చూపుతూ.. అందుకోసం గూగుల్ ను ఆశ్రయించినట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన వివరాలు అమెరికన్లకు ఇలా అందుతున్నాయి. ఉషా చిలుకూరి యూఎస్ లోని కాలిఫోర్నియాలో శాండియాగో ప్రాంతంలో 1986 లో పుట్టిన తెలుగమ్మాయి. ఆమె అక్కడే యేల్ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ.. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
ఈ క్రమంలో న్యాయ విభాగంలో సుదీర్ఘ కాలం ఆమె పనిచేశారు. వాస్తవానికి యేల్ లా స్కూల్ లోనే ఉషా కు జేడీ వాన్స్ కు తొలిసారి పరిచయం అయింది. ఈ క్రమంలోనే వారి పరిచయం ఇష్టంగా, ఇష్టం ప్రేమగా మారడంతో.. 2014లో వీరు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం.
ఇక తాజాగా యూఎస్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన జేడీ వాన్స్ విజయంలో ఉష కీలక పాత్ర పోషించినట్లు చెబుతారు. అతని కెరీర్ లో ఆమె అడుగడుగునా అండగా నిలిచారని అంటారు. ఇక జేడీ వాన్స్ క్రైస్తవ్యాన్ని అనుసరిస్తుండగా.. ఉష హిందూ మతాన్ని ఫాలో అవుతున్నారు.
కాగా... తన భర్త అగ్రరాజ్యం ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్న వేళ అతని వైపు చూసిన ఆమె చూపులకు ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు ఫిదా అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా వరుస పోస్టులు పెడుతూ వారి వారి అభిప్రాయలను వెల్లడిస్తుండగా.. అవి నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఇందులో భాగంగా... "మహిళలారా.. జేడీ వాన్స్ ను ఉషా వాన్స్ చూసే విధంగా మనం మన భర్తలను చూడాలి.. ఎంతో అందంగా ఉంది.. మీ భర్త గురించి గర్వపడండి" అంటూ ఒకరు పోస్ట్ చేయగా.. "పురుషుల్లారా.. జేడీ వాన్స్ ని ఉష చూసే విధంగా మిమ్మల్ని చూసే అమ్మాయిని కనుక్కొండి" అని మరొకరు ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇదే సమయంలో జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం వేళ.. ఉష ధరించిన డ్రెస్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఆమె ధరించిన పింక్ కోట్ చాలా బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె గురించి మరింత తెలుసుకోవాలని అమెరికన్లు గూగుల్ సెర్చ్ చేస్తున్నారు.