అమెరికా చట్టసభ సంచలన నిర్ణయం.. స్కూల్లోకి తుపాకుల అనుమతి!
కానీ, ప్రపంచానికి దిక్సూచి తామేనని చెప్పే.. అగ్రరాజ్యం అమెరికా.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 24 April 2024 4:30 PM GMTకేవలం టీచర్లు చెప్పే పాఠాలు.. చిన్న పిల్లలు చేసే అల్లర్లు.. గుడ్ స్టూడెంట్స్ సంధించే సందేహాలతో మార్మోగాల్సిన పాఠశాలల్లో.. కనీసం బెత్తం కూడా.. కనిపించడానికి వీల్లేదని.. ఐక్యరాజ్యసమితి అన్ని దేశాలను కోరుతోంది. ఈ క్రమంలోనే భారత్ వంటి దేశాల్లో నూతన విద్యావిధానం తెచ్చి.. బెత్తం లేని గురువులు.. చదువులకు పెద్దపీట వేస్తున్నారు. కానీ, ప్రపంచానికి దిక్సూచి తామేనని చెప్పే.. అగ్రరాజ్యం అమెరికా.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లోకి తుపాకులు తీసుకువెళ్లేందుకు చట్ట సభ అనుమతి ఇచ్చింది.
అయితే.. ఇది దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం కాదు. అమెరికాలోని `టెన్నెస్సీ స్టేట్ హౌస్` అసెంబ్లీ మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంది. తీవ్ర వివాదాస్పదమే అయినా.. ఈ చట్టసభలో సభ్యులు సంబంధిత బిల్లు కు ఆమోదం తెలిపారు. సుదీర్ఘ ఉపన్యాసాలు.. ప్రసంగాలు లేవీ లేకుండానే.. ఈ బిల్లును ఆమోదిం చడం గమనార్హం. ఇక, అధికార రిపబ్లికన్ నేతలు మాత్రం ఈ వివాదాస్పద బిల్లును సమర్థించారు. ఇటీ వల కాలంలో స్కూళ్లలో కాల్పుల ఘటనలు పెరిగాయని.. ఉపాధ్యాయుల ఆత్మరక్షణకు ఇది తప్పదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమోదం పొందిన బిల్లు గవర్నర్ సంతకంతో చట్టంగా మారిపోనుంది.
తీవ్ర నిరసన..
చిత్రం ఏంటంటే.. అమెరికాలో గన్ కల్చర్ ఉన్నా.. ఇప్పుడు చాలా మంది అసలు ఈ గన్ కల్చర్‌ను ఎత్తేయాలని ఒత్తిడి తెస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత ఎన్నికల్లో దీనికి హామీ కూడా ఇచ్చారు. ఇలాంటి సమయంలో పాఠశాలల్లోకి వెళ్లేప్పుడు ఉపాధ్యాయులు తుపాకులు పట్టుకుని వెళ్లేందుకు అనుమతి ఇచ్చేలా రూపొందించిన బిల్లుకు చట్టసభల సభ్యులు ఆమోదం తెలపడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ విషయం పత్రికల్లోనూ మీడియాలోనూ ప్రముఖంగా రావడంతో వందల మంది ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు టెన్నెస్సీ స్టేట్ హౌస్ గ్యాలరీలోకి చేరి.. నిరసనలు తెలిపారు.
‘బ్లడ్ ఆన్ యువర్ హ్యాండ్స్’(మీ చేతులు రక్తంతో తడిచిపోయాయి) అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ వారిని బలవంతంగా బయటకు పంపించేశారు.