Begin typing your search above and press return to search.

ఏడాదిలో 777 సినిమాలు చూశాడు.. ఆ తర్వాత ఏమైంది?

సినిమాలు చూడ‌టం ఒక క‌ళ‌. అలాంటి క‌ళ‌లో ఆరితేరిపోవ‌డ‌మే కాదు.. అత‌డు ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కాడు.

By:  Tupaki Desk   |   10 Sep 2023 3:49 AM GMT
ఏడాదిలో 777 సినిమాలు చూశాడు.. ఆ తర్వాత ఏమైంది?
X

సినిమాలు చూడ‌టం ఒక క‌ళ‌. అలాంటి క‌ళ‌లో ఆరితేరిపోవ‌డ‌మే కాదు.. అత‌డు ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కాడు. ఇంత‌కీ ఎవ‌రు అత‌డు? అంటే.. అమెరికాకు చెందిన 32 ఏళ్ల జకారియా స్వోప్‌కు సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే ఆ సినిమాలతో ప్రపంచ రికార్డు సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. ఓ వైపు తన పని చేసుకుంటూనే థియేటర్లలో సినిమాలు చూడటం మొదలుపెట్టాడు. ఉదయం 6.45 గంటల నుంచి మధ్యాహ్నం 2.45 గంటల వరకు విధులకు వెళ్లేవాడు. ఆ తర్వాత రోజుకు కనీసం 3 సినిమాలు చూసేవాడు. సెలవుల్లో వాటిని రెట్టింపు చేశాడు. మే 2022 నుండి దీన్ని ప్రారంభించిన స్వోప్ మే 2023 చివరి నాటికి ఏకంగా 777 చిత్రాలను చూశాడు. మొదట `మిలియన్స్: రైజ్ ఆఫ్ గ్రూ` (మినియన్స్: రైజ్ ఆఫ్ గ్రూ) సినిమాతో ప్రారంభించి `ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ`తో ముగించాడు. దీంతో ఏడాదిలో అత్యధిక సినిమాలను వీక్షించిన వ్యక్తిగా (777 సినిమాల వరల్డ్ రికార్డ్) గిన్నిస్ రికార్డు సాధించాడు. ఫ్రాన్స్ కి చెందిన విన్సెంట్ క్రోస్ సాధించిన 775 సినిమాల రికార్డును ఇప్పుడు స్వోప్ బ్రేక్ చేసాడు.

అయితే ఈ రికార్డు సృష్టించేందుకు స్వోప్ కొన్ని నిబంధనలను కూడా పాటించాడు. అదేంటంటే.. సినిమాలు చూస్తూ వేరే పని చేయకూడదు. అంటే ఫోన్ వైపు చూడటం, నిద్రపోవడం లాంటివి చేయకూడదు. తినడం తాగడం కూడా చేయకూడదు. అతను ఈ నిబంధనలన్నింటినీ పాటించినట్లు ధృవీకరించిన తర్వాత మాత్రమే గిన్నిస్ నిర్వాహకులు జాక్ స్వోప్ పేరును రికార్డులలో నమోదు చేశారు.

మరీ ముఖ్యంగా జాక్ స్వోప్ ఆటిజం గురించి అవగాహన పెంచడానికి ఇలా చేశాడు. `ఆటిజం కారణంగా, నేను గతంలో ఆత్మహత్యకు ప్రయత్నించాను. కానీ అది కరెక్ట్ కాదని తెలిసింది. దాన్నుంచి బయటపడేందుకు సినిమాలు చూసి రికార్డు సాధించాలనుకున్నాను. అందుకే ఇలా చేశాను. భవిష్యత్తులో ఏడాదికి 800 సినిమాలు చూసి నా రికార్డును బద్దలు కొట్టాలనుకుంటున్నా`` అని అన్నారు. ఈ రికార్డును సాధించినందుకు అమెరికన్ ఆత్మహత్య నిరోధక సంస్థ జాక్ స్వోప్‌కు 7,777.77 డాలర్లు (సుమారు రూ. 6 లక్షలు) ప్రదానం చేసింది.