Begin typing your search above and press return to search.

ఆ ఘటన మరిచిపోకముందే.. అమెరికా అధ్యక్షుడు మళ్లీ అలాగే!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ ఏడాది చివరలో జరిగే అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 9:10 AM GMT
ఆ ఘటన మరిచిపోకముందే.. అమెరికా అధ్యక్షుడు మళ్లీ అలాగే!
X

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ ఏడాది చివరలో జరిగే అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది నవంబర్‌ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఆయన పోటీ చేయడం ఖాయమైంది. ఇప్పటికే పోటీకి కావాల్సిన మెజారిటీని ఆయన దక్కించుకున్నారు.

కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యవహార శైలి ఇటీవల కాలంలో హాట్‌ టాపిక్‌ గా మారింది. ఆయనకు ఇప్పుడు 81 సంవత్సరాలు. ఇంత పెద్ద వయసులో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కూడా జో బైడెన్‌ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వృద్ధాప్య సమస్యల వల్లో, లేక మరేదైనా కారణమో కానీ ఆయన ఈ మధ్యకాలంలో వింతగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు.

కొద్ది రోజుల క్రితం జీ7 దేశాల సమావేశానికి ఇటలీకి వెళ్లిన జో బైడెన్‌ అక్కడ ఆ దేశాల అధినేతలు గ్రూప్‌ ఫొటోకి పోజు ఇస్తుంటే.. ఉన్నట్టుండి పక్కకు వెళ్లిపోయారు. అక్కడ ఎవరూ లేకపోయినా వారికి చేతులెత్తి అభివాదం చేశారు. ఇటలీ ప్రధాని జోక్యం చేసుకుని ఆయన చేయిపట్టుకుని గ్రూప్‌ ఫొటో దిగడానికి తీసుకురావాల్సి వచ్చింది. దీంతో జో బైడెన్‌ కు ఏమైందని అప్పుడే ఊహాగానాలు చెలరేగాయి. వృద్ధాప్య సమస్యలు, మతిమరపుతో ఆయన బాధపడుతున్నారని టాక్‌ నడిచింది.

ఈ ఘటన మరిచిపోకముందే మరోసారి అలాంటిదే పునరావృతమైంది. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ నగరంలో డెమోక్రటిక్‌ పార్టీ విరాళాలను సేకరించింది. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా పాల్గొన్నారు. అక్కడ 45 నిమిషాలపాటు జిమ్మీ కిమ్మెల్‌.. ఒబామాను, జో బైడెన్‌ ను ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో వారిద్దరూ ఆ కార్యక్రమానికి హాజరైనవారందరికీ నమస్కరించారు.

కార్యక్రమం ముగిశాక బరాక్‌ ఒబామా స్టేజీ దిగి వచ్చేస్తుండగా జో బైడెన్‌ మాత్రం అలాగే అక్కడే ఉండిపోయారు. కట్టుకొయ్యలాగా స్టేజీపైనే ఎటూ కదలకుండా బిగుసుకుపోయారు. దీంతో ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్న బరాక్‌ ఒబామా వెనక్కి వచ్చి జో బైడెన్‌ చేతిని పట్టుకుని తీసుకువెళ్లారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ గా మారింది. దీంతో అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై పుకార్లు చెలరేగుతున్నాయి. ఆయన వృద్ధాప్య సమస్యలు, పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు అనుమానిస్తున్నారు.

అయితే జో బైడెన్‌ ఆరోగ్యంగా ఉన్నారని అటు అమెరికా అధ్యక్షుడి కార్యాలయం, ఆయన సతీమణి చెబుతున్నారు. 81 ఏళ్ల వయసులోనూ ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.