యూఎస్ లో జాతి ప్రేరేపిత దాడి... తలపాగా ధరించినందుకు పిడిగుద్దులు!
అవును... జాతి ప్రేరేపిత దాడిలో, న్యూయార్క్ నగరంలో మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ బస్సులో ఒక వ్యక్తి 19 ఏళ్ల సిక్కు యువకుడిపై దాడికి తెగబడ్డాడు.
By: Tupaki Desk | 17 Oct 2023 5:10 PM GMTఅమెరికాలో జాతి ప్రేరేపిత దాడి మరొకటి వెలుగు చూసింది. సిక్కు యువకుడు తలపాగా ధరించినందుకు అతడిపై పిడిగుద్దులు కురిపించాడు ఒక దుండగుడు. ఈ నేపథ్యంలో 2022లో ద్వేషపూరిత నేరాల గణాంకాల వార్షిక నివేదికను సోమవారం విడుదల చేసిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ), సిక్కు వ్యతిరేక ద్వేషపూరిత నేరాలకు సంబంధించిన 198 కేసులను నమోదు చేసినట్లు తెలిపింది.
అవును... జాతి ప్రేరేపిత దాడిలో, న్యూయార్క్ నగరంలో మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ బస్సులో ఒక వ్యక్తి 19 ఏళ్ల సిక్కు యువకుడిపై దాడికి తెగబడ్డాడు. తలపాగా ధరించాడనే కారణంతో ఆ యువకుడిని పలుమార్లు కొట్టి, అతని తలపాగాను తొలగించేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో సిక్కు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో... ఆ తర్వాత అతను బస్సు దిగి పరారీలో ఉన్నాడు!
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం... ఆదివారం ఉదయం ఇద్దరు వ్యక్తులు 118వ వీధి, రిచ్ మండ్ హిల్ లోని లిబర్టీ ఎవెన్యూ సమీపంలో షటిల్ బస్సులో ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తలపాగా ధరించిన యువకుడితో నిందితుడు... "మేము ఈ దేశంలో దానిని ధరించము" అని చెప్పాడట. ఈ సమయంలో ఆ యువకుడు తలపాగాను తీయడానికి నిరాకరించడంతో అతడిని చాలాసార్లు కొట్టాడని చెబుతున్నారు.
ఆ తర్వాత అతను బస్సు దిగిన నిందితుడు పరారీలో ఉన్నాడని.. అతడిని పట్టుకోవడంలో సహాయం చేయాలని ప్రజలను కోరుతూ న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక చిత్రాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా కొన్ని గుర్తులను తెలిపింది. ఇందులో భాగంగా... ముదురు రంగు, స్లిమ్ ఫిజిక్ తో సుమారు 5.9 అడుగుల పొడవు, గోధుమ కళ్ళు, నల్లటి జుట్టుతో ఉంటాడని తెలిపారు పోలీసు అధికారులు.
ఇలా ఒక సిక్కు యువకుడిపై జరిగిన దాడిపై యుఎస్ ఆధారిత సిక్కు కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ట్విట్టర్ లో స్పందించింది. ఇదే సమయంలో బాధితుడు చాలా గాయపడ్డాడని, అతని కోసం కుటుంబం చాలా ఆందోళన చెందుతూ, ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆ కమ్యూనిటీ కార్యకర్త జప్నీత్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం బాధిత యువకుడు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడని, అతడు మరికొన్ని రోజులు పనిచేయలేని స్థితిలో ఉన్నాడని తెలిపారు.