Begin typing your search above and press return to search.

'లఖింపూర్'లో బీజేపీ ఖతమేనా ?

లఖింపూర్ ఖేరి లో ఈసారి ఎస్పీ అభ్యర్థిగా ఉత్కర్ష్‌ వర్మ పోటీచేస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 May 2024 1:30 PM GMT
లఖింపూర్లో బీజేపీ ఖతమేనా ?
X

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ ఉద్యమంలో జరిగిన యూపీలోని లఖింపూర్ ఘటనను ఎవరూ మర్చిపోలేరు. ఆందోళన చేస్తున్న రైతులను కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా కారుతో తొక్కించి చంపిన ఘటన సంచలనం రేపింది. దేశవ్యాప్తంగా పెనుదుమారం సృష్టించింది. ఈ సంఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతరం జరిగిన ఆందోళనలలో మరో నలుగురు రైతులు మరణించారు.

అయితే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఖేరి లోక్ సభ ఎంపీ, కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేసినా మోదీ సర్కార్‌ పట్టించుకోలేదు. పైపెచ్చు ఈ సారి ఎన్నికలలో ఆ స్థానం నుండి తిరిగి అజయ్ మిశ్రాకే కేటాయించి రైతుల పుండు మీద బీజేపీ కారంచల్లింది. లఖింపూర్ ఖేరి లో ఈసారి ఎస్పీ అభ్యర్థిగా ఉత్కర్ష్‌ వర్మ పోటీచేస్తున్నారు.

యూపీలో లోక్‌సభ నాలుగో దశలో భాగంగా ఈ నెల 13న 13 లోక్ సభ స్థానాలలో ఎన్నికలు జరగనున్నాయి. యూపీలోని షాజహాన్‌పూర్‌, లఖింపూర్‌ ఖేరీ, ధౌర్హర, సీతాపూర్‌, హర్దోయ్‌, మిస్రిఖ్‌, ఉన్నావో, ఫరూఖాబాద్‌, ఇథవా, కన్నౌజ్‌, కాన్పూర్‌, అక్బర్‌పూర్‌, బహ్రైచ్‌ స్థానాల్లో పోలింగ్‌ జరుగుతుంది. కాన్పూర్‌, బహ్రైచ్‌ స్థానాలను మినహా మిగతా చోట్ల బీజేపీ సిట్టింగ్‌లకే టికెట్లు ఇచ్చింది.

గత ఎన్నికలలో తేలికగా విజయం సాధించిన బీజేపీకి ఈ సారి ఎన్నికలలో ఎస్పీ, కాంగ్రెస్ కూటమి గట్టి పోటీని ఇస్తున్నది. ఈ ప్రాంతంలో బీజేపీపై రైతుల ఆగ్ర హం, పదేళ్ల మోడీ పాలనపై వ్యతిరేకత, కాంగ్రెస్, ఎస్పీ కూటమికి కలిసి వస్తుందని భావిస్తున్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలలో బీజేపీకి అంత సానుకూల పవనాలు లేవని భావిస్తున్నారు.