చంద్రబాబు, ఉత్తమ్ భేటీ వెనుక ఉన్న రహస్యం ఇదా..!
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న వివాదం రచ్చగా మారింది.
By: Tupaki Desk | 13 Sep 2024 5:47 AM GMTఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న వివాదం రచ్చగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వీరి వ్యవహారం చర్చకు దారితీసింది. ఏకంగా దాడులు చేసుకునే వరకూ పరిస్థితి వెళ్లడంతో ఒకవిధంగా నిన్న హైదరాబాద్‌లో టెన్షన్ వాతావరణం కనిపించింది.
ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగాయి. అయితే.. ఈ వివాదంలో ప్రాంతీయత కూడా తెరమీదకు వచ్చింది. కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అరికెపూడి గాంధీ ఆంధ్రకు చెందిన వ్యక్తి అంటూ.. తెలంగాణ అంటే ఏంటో చూపుతామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆ వ్యాఖ్యలు కాస్త దుమారం రేపాయి. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతీయ విభేదాలు మరోసారి తెరమీదకు వచ్చినట్లయింది. ఈ ఎపిసోడ్ ఇలా కొనసాగుతుంటే.. ఏపీలో మరో చర్చనీయాంశమైన ఘటన జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణకు చెందిన మంత్రి భేటీ కావడంపై రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తికరంగా మారింది. అయితే.. వారి భేటీపై పలు ప్రచారాలు సైతం వినిపిస్తున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. అయితే.. వీరి భేటీ వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అలాగే.. ప్రభుత్వపరంగానూ ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనే అంశంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పద్మావతి రెడ్డితో కలిసి భేటీ అయ్యారు. అయితే.. తన చిన్ననాటి స్నేహితుడిని పరామర్శించేందుకు ఉత్తమ్ విజయవాడ వెళ్లినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆ కార్యక్రమం ముగిశాక చంద్రబాబుతో భేటీ అయ్యారని తెలిపారు. అయితే.. ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం కానీ, ప్రభుత్వపరమైన కార్యాచరణ కానీ లేదని వారు వెల్లడిస్తున్నా.. దాని వెనుక పెద్ద రహస్యమే దాగి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఉత్తమ్ దంపతులు చంద్రబాబుతో భేటీ కావడంపై కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పార్టీల మధ్య పొత్తు అంశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. దాంతో చంద్రబాబుతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ చాలా దూరదృష్టితోనే ఉత్తమ్‌ను చంద్రబాబు వద్దకు పంపినట్లుగా తెలుస్తోంది.
కేంద్రంలో బీజేపీ కొలువుదీరడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బిహార్ సీఎం నితీష్ కుమార్ చాలా కీలకంగా మారింది. ఒకవిధంగా చెప్పాలంటే వీరిద్దరి మద్దతుతోనే కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం కొలువుదీరిందనేది బహిరంగ వాస్తవం. అయితే.. నితీష్ కుమార్ బీజేపీపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ నితీష్ కుమార్ బీజేపీకి మద్దతు ఉపసంహరిస్తే ఆయన కచ్చితంగా కాంగ్రెస్ పక్షాన చేరుతారు. దాంతో కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరినట్లు అవుతుంది. ఈ క్రమంలో కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు మద్దతు కూడా కూడగడితే కాంగ్రెస్‌కు మరింత బలం పెరుగుతుందని అధిష్టానం ఆలోచన అని తెలుస్తోంది. అందుకే.. కాంగ్రెస్ హైకమాండ్ ఉత్తమ్‌ను దూతగా పంపించిందని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ ప్రణాళిక కోసమే ఉత్తమ్ చంద్రబాబును కలిశారనే టాక్ నడుస్తోంది.