ఢిల్లీలో ఉత్తమ్.. శ్రీధర్ బాబులు ఎందుకలా బిహేవ్ చేసినట్లు?
రాజకీయాల్లో ఒక పరిణామం చోటు చేసుకుంటే.. అది ఉత్తినే జరగదు. దాని బ్యాక్ గ్రౌండ్ లెక్క వేరే ఉంటుంది. అయితే.. అలాంటి అంశాలు అంత త్వరగా బయటకు రావు.
By: Tupaki Desk | 6 Dec 2023 4:06 AM GMTరాజకీయాల్లో ఒక పరిణామం చోటు చేసుకుంటే.. అది ఉత్తినే జరగదు. దాని బ్యాక్ గ్రౌండ్ లెక్క వేరే ఉంటుంది. అయితే.. అలాంటి అంశాలు అంత త్వరగా బయటకు రావు. సదరు నేతలకు అత్యంత సన్నిహితంగా ఉన్న వారికే తెలుస్తుంటాయి. ఓపక్క రేవంత్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసేందుకు అధిష్ఠానం సానుకూలంగా ఉందన్న విషయం తెలిసి కూడా.. పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దుద్దిళ్ల శ్రీధర్ బాబులు ఇద్దరు మిగిలిన వారికి భిన్నంగా ఎందుకు వ్యవహరించారు? దానికి కారణం ఏమిటి? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ కు కాస్త దూరంలో.. ఇండియన్ బిజినెస్ స్కూల్ కు చాలా దగ్గరగా ఉండే ఎల్లా హోటల్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ మొదలుకొని గెలిచిన ఎమ్మెల్యేలు.. పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా ఉండిపోవటం తెలిసిందే. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎంపిక కోసం మొదలైన కసరత్తు ఆదివారం రాత్రి మొదలై.. మంగళవారం రాత్రి వరకు నాన్ స్టాప్ గా సాగటం తెలిసిందే. ఈ రెండు రోజుల్లో పలు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి.
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి పదవిని రేవంత్ కు అప్పగించేందుకు వీలుగా గ్రౌండ్ ప్రిపేర్ అయిన వేళ.. అనూహ్యంగా సీఎం రేసులోకి దూసుకొచ్చారు భట్టివిక్రమార్క.. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. శ్రీధర్ బాబులు. ఎందుకిలా జరిగింది? అన్న వషయంలోకి వెళితే.. తమను.. తమ డిమాండ్లను రేవంత్ పరిగణలోకి తీసుకోవటంలో ఆశించినంత పాజిటివ్ గా రియాక్టు కాకపోవటంతో గుర్రుగా ఉన్నట్లు చెబుతారు. ఒకదశలో తాము రేవంత్ తో మాట్లాడే కన్నా.. నేరుగా అధిష్టానంతో మాట్లాడుకుంటామని చెప్పి ఢిల్లీకి వెళ్లటం తెలిసిందే.
అక్కడకు వెళ్లిన తర్వాత తత్త్వం బోధ పడటం.. అధిష్ఠానం రేవంత్ వైపు సానుకూలంగా ఉందన్న విషయాన్ని గుర్తించిన వారు చల్లబడ్డారని చెబుతున్నారు. అయితే.. తమ ఉనికి కోసం అంతో ఇంతో అలజడి రేకెత్తించేందుకు వీలుగా ఉత్తమ్.. శ్రీధర్ బాబులు తెగించి మరీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇద్దరు ఎవరికి వారు తాము ముఖ్యమంత్రి రేసులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా మీడియాకు చెప్పటం ద్వారా కలకలాన్ని రేపారు.
దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఉలిక్కి పడి.. వారి వాదనను పరిగణలోకి తీసుకోవటంతో పాటు.. వారిని బుజ్జగించే పనిని చేపట్టింది. ఈ సందర్భంగా రేవంత్ తీరుపై తమకున్న అసహనాన్ని ఉత్తమ్.. శ్రీధర్ బాబులు బయట పెట్టిన వేళ.. వారికి పెద్ద ఎత్తున కౌన్సిలింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా రేవంత్ కు సైతం కొన్ని అంశాలపై క్లారిటీ ఇవ్వాలన్న డిమాండ్ తో పాటు.. సీనియర్లను కలుపుకు వెళ్లాల్సిన బాధ్యతను గుర్తు చేసినట్లుగా చెబుతుున్నారు. మొత్తంగా రేవంత్ మీద యుద్ధానికి దిగేందుకు కోమటిరెడ్డి ఓకే అయినా.. దుద్దిళ్ల శ్రీధర్ బాబు సైతం తెగించటం ఆసక్తికరంగా మారింది.
వీరిద్దరి అసహనాన్ని అధినాయకత్వం పరిగణలోకి తీసుకోవటమే కాదు.. రేవంత్ కు సీనియర్ లను కలుపుకు వెళ్లేలా చూసుకోవాలని చెప్పటం గమనార్హం. ఇలా.. రేవంత్ కు ఝులక్ ఇవ్వటంలో ఉత్తమ్.. శ్రీధర్ బాబులు సక్సెస్ అయినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా మిగిలిన వారంతా రేవంత్ అంశంపై కామ్ అయితే.. వీరిద్దరు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం పార్టీలో ఆసక్తికర చర్చగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరిద్దరి తీరు మిగిలిన వారికి భిన్నంగా నిలిపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.