Begin typing your search above and press return to search.

56వేల కోట్ల నష్టాల్లో సివిల్‌ సప్లై శాఖ... కీలక విషయాలు వెల్లడించిన ఉత్తం!

ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగాయని చెబుతూ.. ఆయా శాఖలు ఎంత నష్టల్లో, ఎన్ని కష్టాల్లో ఉన్నాయో చెప్పుకొస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Dec 2023 9:06 AM GMT
56వేల కోట్ల నష్టాల్లో సివిల్‌  సప్లై శాఖ... కీలక విషయాలు వెల్లడించిన ఉత్తం!
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో.. రాష్ట్రంలో పాలనను గాడిలో పెడతామని చెబుతున్నారు తెలంగాణ మంత్రులు! ఈ సమయంలో ఎవరి శాఖల్లో వారు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంతకాలం రాష్ట్రంలో ఏ శాఖలో ఏమి జరిగింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగాయని చెబుతూ.. ఆయా శాఖలు ఎంత నష్టల్లో, ఎన్ని కష్టాల్లో ఉన్నాయో చెప్పుకొస్తున్నారు. ఈ సమయంలో సివిల్ సప్లై శాఖకు సంబంధించి ఉత్తం కీలక విషయాలు వెల్లడించారు.

అవును... తాజాగా పౌర సరఫరాల శాఖపై మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా... ధాన్యం సేకరణ, మిల్లింగ్‌ సామర్థ్యం, బియ్యం నాణ్యత వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మాట్లాడిన మంత్రి... పౌర సరఫరాల శాఖ భారీ నష్టాల్లో ఉందని తెలిపారు. ఇదే సమయంలో రూ.500కే గ్యాస్ సిలెండర్ సరఫరా, వరికి రూ. 500 బోనస్ లు ఎప్పుడెప్పుడు అందేదీ వివరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... పౌర సరఫరాల శాఖ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. గత ప్రభుత్వం సివిల్‌ సప్లై శాఖకు ఆర్థిక సహాయం చేయకపోవడంతో సుమారు రూ. 56 వేల కోట్లు అప్పు చేసిందని అన్నారు. ఇదే సమయంలో తొమ్మిదిన్నర ఏళ్ల బీఆరెస్స్ పాలనలో లోపాలున్నాయని.. అన్ని శాఖల్లోనూ ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిపారు.

ఇదే సమయంలో... రేషన్‌ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారని తెలిపిన మంత్రి ఉత్తం... రైతుల నుంచి ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలని అన్నారు. ఈ క్రమంలో ప్రధానంగా మిల్లర్ల సమస్యలపైనా అధికారులతో చర్చించామని తెలిపిన ఆయన... కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తులపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇదే క్రమంలో... కిలో రూ. 39 పెట్టి సేకరిస్తున్న బియ్యం ప్రజలకు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపిన మంత్రి... అవి పేదలు తినకపోతే ఇంత పెద్ద గొప్ప ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుందని అన్నారు. ఈ విషయంలో మొక్కుబడిగా బియ్యం పంపిణీ చేయడం కాకుండా.. లోపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలని, ఇందులో భాగంగా బియ్యం లబ్దిదారులను ర్యాండం చెక్కింగ్ చెయ్యాలని ఆదేశించారు.

ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ హామీపైనా ఉత్తం కుమార్ రెడ్డి స్పందించారు. దీనితో పాటు వరికి రూ.500 బోనస్‌ పైనా వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా ఈ రెండు హామీలూ మరో వంద రోజుల్లో అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.