Begin typing your search above and press return to search.

సీఎం అవుతారో లేదో కానీ ఉత్తమ్ కు గడ్డం నుంచి విముక్తి!

By:  Tupaki Desk   |   3 Dec 2023 3:50 AM GMT
సీఎం అవుతారో లేదో  కానీ ఉత్తమ్ కు గడ్డం నుంచి విముక్తి!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వేళలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. ఏళ్లుకు ఏళ్లుగా గడ్డంతో దర్శనమిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన గడ్డాన్ని తీసేయనున్నారు. ఇంతకూ కాంగ్రెస్ విజయానికి.. ఉత్తమ్ గడ్డానికి ఉన్న లింకేమిటి? అంటే అదో పాత కథ.

చాలా పెద్ద సవాల్. తన నోటి నుచి వచ్చిన మాటకు కట్టుబడి ఉన్న ఉత్తమ్ ఏళ్లకు ఏళ్లుగా గడ్డంతో ఉండటమే కాదు.. మంత్రి కేటీఆర్.. కవిత లాంటి వారి నుంచి ఎటకారాలు ఎదుర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. పొన్నాల లక్ష్మయ్యను పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయటం.. పార్టీని నడిపించే విషయంలో ఆయన ఫెయిల్ కావటంతో ఆయన స్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని టీపీసీసీ రథసారధిగా నియమించటం తెలిసిందే. ఆయన నాయకత్వంలోనే 2018 అసెంబ్లీ ఎన్నిలకు పార్టీ వెళ్లింది. ఒక సందర్భంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు తాను గడ్డం తీయనని భారీ శపధం చేశారు.

ఆయన నోటి నుంచి వచ్చిన మాటను మంత్రి కేటీఆర్ అయితే కామెడీ చేశారు. ఆయన జీవితాంతం గడ్డంతోనే ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయితే.. ఉత్తమ్ మాత్రం వారి మాటల్ని పట్టించుకోలేదు కానీ.. తన మాటకు కట్టుబడి ఉండి.. అప్పటి నుంచి గడ్డం తీయకుండా అలానే ఉంచేశారు. ఒకప్పుడు క్లీన్ షేవ్ గా ఉండే ఉత్తమ్ కొన్నేళ్లుగా గడ్డంతోనే ఉంటున్న పరిస్థితి.

తాజాగా జరిగిన ఎన్నికల అనంతరం.. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఉత్తమ్.. కాంగ్రెస్ పార్టీకి 70 ప్లస్ సీట్లుఖాయమని తేల్చారు. అంతేకాదు.. తాను ఆదివారం గడ్డం తీసేయనున్నట్లుగా స్పష్టం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని.. అందులో ఎలాంటి అనుమానం లేదన్న ఉత్తమ్.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ జిల్లా నుంచి అత్యధిక స్థానాల్ని కాంగ్రెస్ గెలుచుకోనున్నట్లుగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీ అధినాయకత్వానిదేనని.. వారు తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉండనున్నట్లు చెప్పారు. మొత్తంగా కాంగ్రెస్ గెలుపుతో ఉత్తమ్ సీఎం అవుతారో లేదో కానీ.. గడ్డం నుంచి మాత్రం ఆయనకు విముక్తి కలుగుతుందని మాత్రం చెప్పక తప్పదు.